Indigo Pilot Attacked By Passenger:దిల్లీ విమానాశ్రయంలో పైలట్‌పై దాడికి దిగాడు ఓ ప్రయాణికుడు. విమానం ఆలస్యంగా నడుస్తుందని పైలట్ ప్రకటన చేస్తున్న సమయంలోనే దాడి చేశాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఘటన ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంటకు జరిగింది.
ఇదీ జరిగింది
ఇండిగోకు చెందిన 6E 2175 విమానం దిల్లీ విమానాశ్రయం నుంచి గోవా వెళ్లేందుకు సిద్ధమైంది. వాతావరణం సహకరించకపోవడం వల్ల ఆలస్యం అవుతుందని పైలట్ ప్రకటన చేశారు. ఈక్రమంలోనే ఆగ్రహించిన ప్రయాణికుడు, చివర వరుస నుంచి వచ్చి పైలట్‌పై దాడి చేశాడు. ఇతర సభ్యులు అతడిని శాంతింపజేశారు. అందరు ప్రయాణికులు సహనంతో ఉండాలని కోరారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీనిని తీవ్రంగా పరిగణించిన విమానయాన భద్రతా సంస్థ దర్యాప్తునకు ఆదేశించింది. నిందితుడిని సాహిల్ కటారియాగా గుర్తించిన భద్రతా అధికారులు, అతడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన అధికారులు, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఇండిగో అంతర్గత కమిటీ ఏర్పాటు
మరోవైపు, ఈ ఘటనపై స్పందించిన విమానయాన సంస్థ ఇండిగో, ప్రయాణికుడిపై ఫిర్యాదు చేసింది. ఈ అంశంపై దర్యాప్తు చేసేందుకు అంతర్గత కమిటీని ఏర్పాటు చేసింది. అనుచితంగా ప్రవర్తించిన నిందితుడిని నో-ఫ్లై జాబితాలో చేర్చడంపై ఈ కమిటీ సూచనలు చేయనున్నట్లు సమాచారం.