G20 Presidency : భారత్ జీ20 అధ్యక్ష పగ్గాలు చేపట్టినందున ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒక భవిష్యత్తు అనే థీమ్ ప్రేరణతో ఏకత్వాన్ని ప్రోత్సహించేందుకు పనిచేయనున్నట్లు ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. తద్వారా ఉగ్రవాదం, వాతావరణ మార్పు, మహమ్మారి వంటి భారీ సవాళ్లను కలిసికట్టుగా ఎదుర్కోవచ్చన్నారు. భారత్ జీ20 అజెండా ప్రతిష్టాత్మకంగా, కార్యాచరణ ఆధారితంగా, నిర్ణయాత్మకంగా ఉంటుందని ప్రధాని మోదీ తెలిపారు. భారత్ జీ20 అధ్యక్ష స్థానాన్ని వైద్యం, సామరస్యం, ఆశల ప్రెసిడెన్సీగా మార్చేందుకు కలిసి పనిచేద్దామన్నారు. మానవ-కేంద్రీకృత ప్రపంచీకరణకు కొత్త నమూనా రూపొందించడానికి కృషి చేయనున్నట్లు పేర్కొన్నారు. స్థిరమైన జీవనశైలి, ప్రపంచ ఆహార, ఎరువులు, మందులు, ఇతర వస్తువుల సరఫరా వ్యవస్థను రాజకీయాలతో సంబంధం లేకుండా చేయటం కోసం భారత్ ఎదురుచూస్తోందన్నారు.
జీ20 అధ్యక్ష పగ్గాలు చేపట్టిన భారత్.. అమెరికా, ఫ్రాన్స్ కీలక సందేశం - భారత్ జి 20 సదస్సు
భారత్ జీ20 అధ్యక్ష పగ్గాలు చేపట్టినందున.. ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒక భవిష్యత్తు అనే థీమ్ ప్రేరణతో ఏకత్వాన్ని ప్రోత్సహించేందుకు పనిచేయనున్నట్లు ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. ఈ సందర్భంగా ప్రపంచంలోని పలు దేశాలు భారత్‌కు తమ మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించాయి.
భారత్‌కు శ్వేతసౌధం నుంచి మద్దతు..
జీ20 అధ్యక్ష పదవిని భారత్ అధికారికంగా చేపట్టిన సందర్భంగా ప్రపంచంలోని పలు దేశాలు భారత్‌కు తమ మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించాయి. ఈ క్రమంలో అమెరికాతో పాటు ఫ్రాన్స్ తమ మద్దతును తెలియజేశాయి.
"ప్రస్తుతం ఉన్న ఆహార ఇంధన భద్రత సవాళ్లను పరిష్కరించడం సహా, స్థిరమైన ప్రపంచ ఆర్థిక వ్యవస్థను నిర్మించడానికి మా ప్రయత్నాలను కొనసాగిస్తాం. భారత్తో కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నాము" అని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరీన్ జీన్-పియర్ తెలిపారు.
"డిసంబర్ 1 నుంచి ఏడాది పాటు జీ20 అధ్యక్ష పదవిని భారత్ చేపట్టనుంది. ఇందులో భాగంగా ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ ప్రపంచాన్ని ఐక్యంగా ఉంచడానికి మేము ప్రయత్నిస్తున్నాము. భారత దేశాన్ని సారథిగా చూడటం మాకు ఆనందంగా ఉంది. భారత్‌కు ఫ్రాన్స్ నుంచి పూర్తి మద్దతు ఉంటుంది" అని భారత్‌కు చెందిన ఫ్రాన్స్ రాయబారి ఇమ్మాన్యుయేల్ లెనైన్ ట్వీట్ చేశారు.