భారత టీకా కార్యక్రమం గురువారం వంద కోట్ల డోసుల మార్కును నమోదు చేయనుంది. కొవిన్ పోర్టల్‌లోని వివరాల ప్రకారం.. బుధవారం సాయంత్రం నాటికి దేశవ్యాప్తంగా మొత్తం 99.7 కోట్ల టీకా డోసులు ప్రజలకు అందాయి. ఇప్పటివరకూ వయోజనుల్లో 75% ఒక్క డోసు, 31% రెండు డోసులు తీసుకున్నారు. గురువారం 100 కోట్ల మార్కును అధిగమిస్తామని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ తెలిపారు. అర్హులంతా వ్యాక్సిన్ తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన బుధవారం ట్వీట్ చేశారు. లక్ష్యాన్ని చేరిన వెంటనే మెట్రోలు, రైల్వేస్టేషన్లతో పాటు.. విమానాలు, నౌకల్లో ప్రకటనలు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. అలాగే కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రత్యేకంగా వేడుకలు జరగనున్నాయి.
వంద కోట్ల మార్కును పురస్కరించుకుని దిల్లీ ఎర్రకోట వద్ద 1400కిలోల బరువుండే త్రివర్ణపతాకాన్ని ప్రదర్శించనున్నారు. గాయకుడు కైలాశ్ ఖేర్ రాసిన పాటను, మరో చిత్రాన్ని ఎర్రకోట వద్ద కేంద్ర ఆరోగ్య మంత్రి గురువారం ఆవిష్కరిస్తారు. రికార్డు స్థాయిలో టీకాలు అందించినందుకు గుర్తుగా దిల్లీ విమానాశ్రయంలో స్పైస్‌జెట్ ప్రత్యేక కార్యక్రమం చేపట్టనుంది.