ఆక్స్ఫర్డ్ టీకాకు బ్రిటన్ ఆమోదం తెలపడం గొప్ప ముందడుగు అని దిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ డా. రణదీప్ గులేరియా పేర్కొన్నారు. భారత్‌లోనూ ఈ టీకా త్వరలో అందుబాటులోకి వస్తుందన్నారు. రెగ్యులేటరీ సంస్థ వద్ద ఉన్న టీకా ట్రయల్స్ డేటాను బట్టి రోజుల వ్యవధిలోనే ఆమోదం లభించే అవకాశం ఉందని అంచనా వేశారు.
"కొవిడ్ వ్యాక్సిన్‌ను భారత్ దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురానుంది. చాలా త్వరలోనే టీకాకు అనుమతులు వస్తాయి. నెలలు, వారాలు కాదు.. రోజుల్లోనే టీకాకు ఆమోదం లభిస్తుంది."
-డా. రణదీప్ గులేరియా, దిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్
వ్యాక్సినేషన్ విషయంలో పగడ్బందీ ప్రణాళికలు ఉన్నాయని గులేరియా తెలిపారు. సార్వత్రిక టీకా పంపిణీ కార్యక్రమం ద్వారా వ్యాక్సిన్లను పెద్ద ఎత్తున సరఫరా చేసిన అనుభవం దేశానికి ఉందన్నారు.
నవంబర్లోనే..
మరోవైపు, బ్రిటన్‌లో వెలుగులోకి వచ్చిన కొత్త రకం కరోనా నవంబర్లోనే దేశంలోకి ప్రవేశించి ఉంటుందని తెలిపారు గులేరియా. యూకేలో సెప్టెంబర్ నెలలో ఈ వైరస్ గుర్తించారని, ఆ తర్వాత దేశంలోకి వచ్చినవారికి కొత్త స్ట్రెయిన్ సోకి ఉండొచ్చని పేర్కొన్నారు. యూకేలో కొత్త స్ట్రెయిన్ బాధితుడు బయటపడక ముందే హోలండ్లో ఇలాంటి కేసు వెలుగులోకి వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. కాబట్టి నవంబర్‌లో లేదా డిసెంబర్ తొలినాళ్లలోనే ఈ వైరస్ బాధితులు వచ్చి ఉండొచ్చని అన్నారు. ఈ నేపథ్యంలో బాధితులను గుర్తించేందుకు నవంబర్ నుంచి సేకరించిన శాంపిళ్లను పరిక్షిస్తున్నట్లు చెప్పారు.
అయితే కొత్త కరోనా వల్ల తీవ్ర ప్రమాదమేమీ లేదని చెప్పారు గులేరియా. వైరస్ కేవలం పరివర్తనం చెందుతోందని, ఈ ప్రక్రియ గత పది నెలలుగా ఈ ప్రక్రియ జరుగుతూనే ఉందని వెల్లడించారు. వేగంగా వ్యాప్తి చెందుతుండటమే ఆందోళనకరమైన విషయమని అన్నారు. టీకా సమర్థతపై కొత్త వైరస్ ప్రభావం ఉండబోదని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి:దేశంలో 20 మందికి కొత్త రకం కరోనా నిర్ధరణ