India On Khalistan Secret Memo : ఖలీస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ సహా సిక్కు వేర్పాటువాదులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏప్రిల్‌లో భారత్ సీక్రెట్ మెమో జారీ చేసిందన్న మీడియా కథనాన్ని కేంద్రం కొట్టిపారేసింది. ఆ నివేదిక నకిలీదే కాకుండా పూర్తిగా కల్పితమని పేర్కొంది. తాము అలాంటి మెమో జారీ చేయలేదని స్పష్టం చేసింది. ఈ వ్యవహారంపై స్పందించిన విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ, భారత్‌కు వ్యతిరేకంగా నివేదిక ఇచ్చిన అవుట్‌లెట్ పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ ద్వారా నకిలీ కథనాలను ప్రచారం చేయడంలో ప్రసిద్ధి చెందిందని ఆరోపించారు.
పశ్చిమ దేశాల్లోని కొన్ని సిక్కు సంస్థలను అణచివేసే పథకంలో భాగంగా ఏప్రిల్‌లో కేంద్రం సూచనలు జారీ చేసినట్లు అమెరికా ఆన్‌లైన్ మీడియా ది ఇంటర్‌సెప్ట్ ఓ కథనంలో పేర్కొంది. భారత్ జారీ చేసిన రహస్య మెమోలో నిజ్జర్ సహా అనేక మంది సిక్కు వేర్పాటువాదుల పేర్లు ఉన్నట్లు తెలిపింది. అయితే, ఇందులో ఖలీస్థానీ వేర్పాటువాదుల హత్యకు ఆదేశాలు ఇవ్వలేదని చెప్పింది. కానీ అమెరికా, కెనడాలో పనిచేసే రాయబార అధికారులు, భారత్లోని నిఘా సంస్థలైన జాతీయ దర్యాప్తు సంస్థ (NIA), ఇంటిలెజెన్స్ బ్యూరో (IB)తో కలిసి పనిచేయాలని చెప్పినట్లు పేర్కొంది.