Himachal Pradesh Elections 2022 : దేశంలోనే అత్యధిక వయస్కుడైన ఓటరుగా రికార్డు నమోదు చేసిన హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన 106 ఏళ్ల శ్యాం సరన్ నేగి.. మరోసారి ఓటు హక్కు వినియోగించుకునేందుకు సిద్ధమయ్యారు. వృద్ధాప్యం కారణంగా ప్రభుత్వం ఆయనకు పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పించినా.. నేగి నిరాకరించారు. తాను స్వయంగా పోలింగ్ బూత్‌కు వెళ్లే ఓటు హక్కు వినియోగించుకుంటానని స్పష్టం చేశారు.
కిన్నౌర్ జిల్లా ఎన్నికల సంఘం అధికారులు.. 12-డి ఫారాన్ని తీసుకుని నేగి ఇంటికి వెళ్లారు. పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఆయన ఓటు వేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. కానీ ఆయన 12-డి ఫారాన్ని తిరిగి ఎన్నికల అధికారులకే ఇచ్చేశారు. తాను పోలింగ్ బూత్‌కు వెళ్లి మాత్రమే ఓటు వేస్తానని తెలిపారు. ఈ విషయాన్ని ఎన్నికల అధికారి అబిద్ హుస్సేన్ తెలిపారు. నవంబరు 12వ తేదీన నేగిని ప్రత్యేక వాహనంలో పోలింగ్ కేంద్రానికి తీసుకెళ్లనున్నట్లు చెప్పారు. అక్కడ ఎర్ర తివాచీతో ఘన స్వాగతం పలకనున్నట్లు వెల్లడించారు.