దాదాపు మూడున్నర నెలల తర్వాత భారత్, చైనా మధ్య కోర్ కమాండర్ స్థాయి అధికారుల మరో విడత చర్చలకు రంగం సిద్ధమైంది. 2020 మే నెలలో సరిహద్దు వివాదం తలెత్తినప్పటి నుంచి ఉద్రిక్తతలు తగ్గించుకునేందుకు ఇరు దేశాల మధ్య ఇప్పటివరకు 11 సార్లు కోర్ కమాండర్ స్థాయి అధికారుల మధ్య చర్చలు జరిగాయి. ఏప్రిల్ 9న 11వ భేటీ జరగగా.. శనివారం తదుపరి విడత సమావేశం జరగనుంది. తూర్పు లద్దాఖ్‌లోని వాస్తవాధీన రేఖ వద్ద చైనా భూభాగంలోని మోల్డోలో ఉదయం 10.30కు ఈ భేటీ జరగనుంది. హాట్ స్ప్రింగ్స్, గోగ్రా హైట్స్ ప్రాంతాల నుంచి బలగాల ఉపసంహరణపై ఇరు దేశాలు చర్చించే అవకాశం ఉంది.
భారత్, చైనా మధ్య ఏడాది నుంచి సరిహద్దు వివాదం సాగుతున్నా విస్తృత స్ధాయి చర్చల తర్వాత పాంగాంగ్ సరస్సు ప్రాంతం నుంచి ఇరుదేశాలు బలగాలను ఉపసంహరించుకున్నాయి. ఘర్షణకు కేంద్ర బిందువుగా నిలిచిన అన్ని ప్రాంతాల నుంచి బలగాల ఉపసంహరణ జరగాలని భారత్ స్పష్టం చేస్తుండగా.. చైనా మాత్రం మొదట ఉద్రిక్తతలు చల్లారాలని వాదిస్తోంది. సరిహద్దులకు కాస్త దూరంలో మోహరించిన భారత అదనపు బలగాలు తమ పాత స్థానాలకు వెళ్లిపోవాలని, ఆ తర్వాతే ప్రతిష్టంభన నెలకొన్న ప్రాంతాల్లో మిగిలిన చోట్ల నుంచి బలగాల ఉపసంహరణ జరుగుతుందని చెబుతోంది.
డ్రాగన్ ద్వంద్వ వైఖరి..