India Canada Visa News Today :కెనడాలో వీసా సేవలను భారత్ బుధవారం పునఃప్రారంభించింది. ఎంట్రీ వీసా, బిజినెస్ వీసా, మెడికల్ వీసా, కాన్ఫ్రెన్స్ వీసాలను మాత్రమే మంజూరు చేస్తున్నట్లు కెనడాలోని భారత హై కమిషన్ ప్రకటించింది. ఈ సేవలు గురువారం (అక్టోబర్ 26) నుంచి ప్రారంభమవుతాయని తెలిపింది. అయితే కెనడాలోని తమ దౌత్యవేత్తల భద్రతలో పురోగతిని వస్తే కెనడాలో వీసా సేవలను 'అతి త్వరలో' పునరుద్ధరించాలని అనుకుంటున్నట్లు భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఆదివారం అన్నారు. ఈ నేపథ్యంలో భారత్ వీసా సేవలను పునరుద్ధరించడం గమనార్హం.
India Canada Relations : 'భారత దౌత్యవేత్తల భద్రత విషయంలో ఇటీవల కెనడా చేపట్టిన చర్యలను పరిగణలోకి తీసుకున్నాము. భద్రత పరిస్థితులను పరిశీలించిన తర్వాత వీసా సేవలు పునరుద్ధరించాలని నిర్ణయించాము. ఎంట్రీ వీసా, బిజినెస్ వీసా, మెడికల్ వీసా, కాన్ఫ్రెన్స్ వీసాలను అక్టోబర్ 26 నుంచి మంజూరు చేస్తున్నాము' అని కెనడాలోని భారత హైకమిషన్ ఓ ప్రకటనలో తెలిపింది.
భారత్ వార్నింగ్.. తలొగ్గిన కెనడా..
అంతకుముందు భారత్‌లోని తమ దౌత్య సిబ్బందిలో 41 మందిని వారి కుటుంబ సభ్యులతో సహా వెనక్కు రప్పించుకున్నట్టు ఇటీవల కెనడా అధికారికంగా ప్రకటించింది. దౌత్య సిబ్బందిని తగ్గించుకోకపోతే వారికి అందించే దౌత్యపరమైన రక్షణను ఉపసంహరిస్తామంటూ భారత్ హెచ్చరించిన క్రమంలో సిబ్బంది కుదింపు చర్య చేపట్టినట్లు ఆ దేశ విదేశీ వ్యవహారాల మంత్రి మెలానీ జోలీ వెల్లడించారు. దౌత్యవేత్తలకు రక్షణను ఉపసంహరించుకోవడమేనది అనూహ్యమైన చర్య అని.. అది అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని మెలానీ జోలీ ఆరోపించారు.