తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భుట్టో వ్యాఖ్యలపై భగ్గుమన్న భాజపా.. భారత్‌ను చూసి ఓర్వలేకే అంటూ..

పాకిస్థాన్​ మరింత దిగజారింది. ఇప్పటివరకూ అంతర్జాతీయ వేదికలపై భారత్‌పై విషం కక్కిన దాయాది దేశం.. ఐక్యరాజ్య సమితిలో ప్రధాని మోదీపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలతో పాతాళానికి పడిపోయింది. లాడెన్‌ సహా ఉగ్రవాదులకు దేశాన్ని స్వర్గధామంలా మార్చిన పాక్‌.. ఐరాసలో భారత్‌పై అక్కసు వెళ్లగక్కింది. పాక్‌ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో.. ప్రధాని మోదీపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలతో భారత్‌ భగ్గుమంది. దాయాది దేశం క్షమాపణలు చెప్పాల్సిందేనని తీవ్ర స్వరంతో హెచ్చరించింది.

Etv Bharat
Etv Bharat

By

Published : Dec 16, 2022, 8:09 PM IST

ఎప్పటికప్పుడు తన ప్రతిష్ఠను దిగజార్చుకునే పాకిస్తాన్‌.. మరోసారి అంతర్జాతీయ వేదికపై అభ్యంతరకర వ్యాఖ్యలతో తన పరువును పాతాళానికి పడేసుకుంది. పాక్‌ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో.. ఐక్యరాజ్య సమితిలో ప్రధాని మోదీపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు భారత్‌పై పాక్‌ అసహనాన్ని విశ్వ వేదికపై మరోసారి బహిర్గతం చేశాయి. మోదీపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో భారత్‌ భగ్గుమంది. బిన్ లాడెన్‌ను అమరవీరుడని కీర్తించిన పాక్‌.. లఖ్వీ, హఫీజ్ సయీద్, మసూద్ అజార్, సాజిద్ మీర్, దావూద్ ఇబ్రహీం వంటి ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చిన పాక్‌.. భారత్‌ను చూసి ఓర్వలేకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తోందని మండిపడింది.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఉద్దేశించి పాకిస్థాన్ విదేశాంగమంత్రి బిలావల్ భుట్టో చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలను విదేశాంగ శాఖ గట్టిగా తిప్పికొట్టింది. బిలావల్ వ్యాఖ్యలు పాకిస్థాన్ స్థాయిని మరింత దిగజార్చాయని పేర్కొంది. తమ దేశంలోని ఉగ్రదాడుల సూత్రధారులను ఉద్దేశించి పాక్‌ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే బాగుండేదని విదేశాంగ శాఖ హితవు పలికింది. మరే దేశంలో లేని విధంగా పాకిస్థాన్ లో 126మంది ప్రపంచస్థాయి ఉగ్రవాదులు, ఐరాస నిషేధిత 27ఉగ్రసంస్థలు ఉన్నట్లు విదేశాంగ శాఖ చురకలు వేసింది. ఉగ్రవాదులను ప్రోత్సహించటం, వారికి ఆశ్రయం ఇవ్వటం, ఆర్థికసాయం అందిస్తున్న పాకిస్థాన్ పై నిఘా ఉన్నట్లు తెలిపింది.

పాక్ విదేశాంగ మంత్రి వ్యాఖ్యలు.. ఆ దేశ అసమర్థ పాలనకు నిదర్శనమని భారత్‌ విమర్శించింది. 1971 డిసెంబర్‌ 16న ఏం జరిగిందో పాక్‌ విదేశాంగ మంత్రి మరిచిపోయారా అని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ ఎద్దేవా చేశారు. న్యూయార్క్, ముంబయి, పుల్వామా, పఠాన్‌కోట్, లండన్ వంటి నగరాలు పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాద ఘటనలకు ఇప్పటికీ ప్రత్యక్ష సాక్ష్యాలుగా మిగిలి ఉన్నాయని భారత్‌ గుర్తు చేసింది. ఒక దేశ విదేశాంగ మంత్రి మాట్లాడే తీరు అలా ఉండకూడదని.. కానీ పాకిస్థాన్ నుంచి ఇంతకన్నా ఏం ఆశించగలమని భారత్‌ విదేశాంగ శాఖ సమాధానం ఇచ్చింది.

బిలావల్‌ వ్యాఖ్యలు 1971 డిసెంబర్‌ 16న భారత్‌ చేతిలో ఓడిపోయిన బాధలో వచ్చాయని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఎద్దేవా చేశారు. పాకిస్తాన్‌ నుంచి ఇంతకంటే మెరుగ్గా ఏమీ ఆశించ లేమని విదేశాంగ శాఖ సహాయ మంత్రి మీనాక్షీ లేఖి అన్నారు. బిలావల్‌ వ్యాఖ్యలను ఎవరూ పట్టించుకోవాల్సిన అవసరం లేదని భాజపా విదేశీ వ్యవహారాల విభాగం అధిపతి విజయ్ చౌతైవాలే అన్నారు. మోదీపై బిలావల్ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలను భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండించింది. దిల్లీలోని పాకిస్థాన్ రాయబార కార్యాలయం ముందు ఆ పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. నైతికంగా, మేథోపరంగా, ఆర్థికంగా దివాలా తీసిన పాకిస్థాన్ కు బిలావల్ భుట్టో ప్రాతినిథ్యం వహిస్తున్నారని, ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్న ఆ దేశానికి విశ్వసనీయతే లేదని భాజపా నేతలు ధ్వజమెత్తారు. బిలావల్‌ భుట్టో వ్యాఖ్యలకు నిరసనగా శనివారం దేశవ్యాప్తంగా ఆందోళనలకు భాజపా పిలుపునిచ్చింది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details