దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధావాకర్ తరహా ఘటన మరొకటి జరిగింది. పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేసినందుకు ఓ యువతిని హత్య చేసి దాబాలోని ఫ్రిజ్‌లో దాచిపెట్టాడు ఓ కిరాతకుడు. ఈ ఘటన దేశ రాజధాని దిల్లీ శివార్లలోని హరిదాస్పుర్లో జరిగింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. యువతిని నాలుగు రోజుల క్రితమే హత్య చేసి ఫ్రిజ్‌లో పెట్టి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.
మిత్రావు గ్రామానికి చెందిన సహిల్ గహ్లోత్, ఉత్తమ్‌నగర్ ప్రాంతానికి చెందిన ఓ యువతి ప్రేమించుకున్నారు. అయితే, ప్రేమించిన యువతితో కాకుండా.. మరో అమ్మాయితో పెళ్లిని నిశ్చయించుకున్నాడు గహ్లోత్. ఫిబ్రవరి 10న వీరి వివాహం జరగాల్సి ఉంది. ఈ విషయం తెలుసుకున్న ప్రియురాలు.. గహ్లోత్‌తో గొడవ పడింది. ఈ క్రమంలోనే ఆగ్రహించిన గహ్లోత్.. ఆమెను హత్య చేసి తన దాబాలోని ఫ్రిజ్‌లో దాచిపెట్టాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం తరలించారు.
ఇలాంటి ఘటనే గతేడాది దిల్లీలో జరిగింది. అఫ్తాబ్ పూనావాలా అనే వ్యక్తి తనతో సహజీవనం చేస్తున్న శ్రద్ధావాకర్‌ను హత్య చేసి 35 ముక్కలుగా నరికాడు. అనంతరం వాటిని ఫ్రిజ్‌లో దాచిపెట్టాడు. మూడు వారాల పాటు ఫ్రిజ్‌లో ఉంచిన తర్వాత శరీర భాగాలను నగరంలోని వివిధ ప్రాంతాల్లో పడేశాడు.