కరోనా మహమ్మారి కట్టడికి కేంద్రం సమయానుగుణంగా తీసుకున్న చర్యల వల్ల ఎంతో మంది పౌరుల ప్రాణాలు కాపాడగలిగామని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అన్నారు. మహమ్మారి అనేక మంది ప్రాణాలు బలీతీసుకుందని విచారం వ్యక్తం చేశారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయసభలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ప్రతి సమస్యను దేశమంతా ఒక్కటిగా ఎదుర్కొందన్నారు. కరోనాపై భారతదేశం పోరాటం ఎంతో స్ఫూర్తిదాయకమని కొనియాడారు.
"లక్షలాదిమంది పౌరుల ప్రాణాలు కాపాడేలా ప్రభుత్వం తీసుకున్న చర్యలు సంతృప్తినిచ్చాయి. దేశంలో కరోనా కేసులు చాలావేగంగా తగ్గుతున్నాయి. కోలుకుంటున్న వారిసంఖ్య కూడా ఎక్కువగా ఉంది. దేశంలోని పేద ప్రజలందరికీ ఆరోగ్య సంరక్షణ సేవలు అందుబాటులోకి వచ్చాయి. కరోనా తర్వాత కొత్త సామర్థ్యంతో భారత్ ప్రపంచం ముందు శక్తిమంతమైన దేశంగా నిలిచింది. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి స్వయం సమృద్ధి భారతం ఒక స్వప్నం. కరోనా సంక్షోభం ఆ స్వప్నాన్ని సాకారం చేసుకునే అవకాశాన్ని కల్పించింది. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమం భారత్‌లో జరుగుతోంది. దేశంలో తయారవుతున్న వ్యాక్సిన్లు అనేక దేశాలకు సరఫరా అవుతున్నాయి. లక్షలకొద్ది వ్యాక్సిన్ డోసులు ఇతర దేశాలకు పంపించాం. సంక్షోభ సమయంలో పొరుగు దేశాలతో భారత్ కలసి సాగుతోంది.