Human sacrifice in Maharashtra: గుప్త నిధుల వేటలో కొందరు అత్యంత క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. మనుషులను బలిస్తే ఎన్నడూ చూడనంత సంపద లభిస్తుందని కొందరు చెప్పే కట్టుకథలను నమ్మి సొంత వారిని సైతం బలిచేసేందుకు వెనకాడటం లేదు. అలాంటి సంఘటనే మహారాష్ట్రలోని యావత్మాల్ జిల్లాలో వెలుగు చూసింది. గుప్త నిధుల కోసం 18 ఏళ్ల కన్న కూతురినే బలిచ్చేందుకు సిద్ధమయ్యాడు ఓ తండి. గత సోమవారం బాబుల్గావూన్ తహసీల్‌లోని మద్ని గ్రామంలో గుప్తు నిధుల కోసం బలి ఇస్తున్నారని తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. తాంత్రికుడు, బాలిక తండ్రితో పాటు మరో ఏడుగురిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు.
ఇదీ జరిగింది:నిందితుల్లో ఒకరికి ఇద్దరు కుమార్తెలు. పెద్ద కూతురు బంధువుల ఇంటి వద్ద ఉంటూ చదువుకుంటోంది. ఇటీవలే తన సొంత ఊరికి వచ్చింది. ఈ క్రమంలో ఆమెపై లైంగిక దాడికి పాల్పడి బెదిరించాడు తండ్రి. ఆ తర్వాత ఇంట్లో తాంత్రిక పూజలు చేయటం ప్రారంభించాడు. తన కుమార్తెను సజీవంగా ఖననం చేసేందుకు ఏప్రిల్ 25న ఇంట్లోనే పెద్ద గొయ్యి తవ్వాడు. ఈ విషయాన్ని గమనించిన బాలిక తన స్నేహితురాలికి సమాచారం చేరవేసింది. ఆమె పోలీసులకు చెప్పింది. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షుద్ర పూజలు చేస్తున్న వారిని అరెస్ట్ చేసి బాలికను రక్షించినట్లు యావత్మాల్ ఎస్పీ దిలీప్ భుజ్బాల్ పాటిల్ తెలిపారు. హత్యాయత్నం(307), 376(అత్యాచారం), ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు.
తుపాకులతో బెదిరించి అక్కాచెల్లెళ్లపై గ్యాంగ్ రేప్: తుపాకులతో బెదిరించి ఇద్దరు అక్కాచెల్లెళ్లపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన బిహార్, పట్నాలోని ఫుల్వారీ షరీఫ్‌లో వెలుగు చూసింది. బాధితుల ఫిర్యాదు ప్రకారం.. గతం సోమవారం రాత్రి ఇద్దరు అక్కచెల్లెళ్లు బహిర్భూమికి వెళ్లారు. ఇద్దరు దుండగులు ఆయుధాలతో బైక్‌లపై అక్కడికి చేరుకుని వారిని బెదిరించారు. రాత్రంతా వారిపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. వారు అరిచేందుకు ప్రయత్నించగా చంపేస్తామని తుపాకీ చూపించారు.
తమ పేరు వికాశ్ కుమార్, సమీర్ కుమార్ అని, పోలీసులు సైతం తమను ఏమీ చేయలేరని చెప్పారు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయారు. మంగళవారం ఉదయం తమ కుటుంబ సభ్యులతో నేరుగా ఖగౌల్ పోలీస్ స్టేషన్ చేరుకుని ఫిర్యాదు చేశారు బాధితులు. ఫిర్యాదు అందుకున్న కొన్ని గంటల్లోనే నిందితులిద్దరిని అరెస్ట్ చేశారు పోలీసులు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.