How to do Vahana Pooja on the Occassion of Dasara and Diwali Festival : హిందూ మతాన్ని అనుసరించే వారు.. కొత్తగా వాహనం కొనుగోలు చేస్తే తప్పకుండా వాహనానికి పూజ చేయిస్తారు. ఇక, దసరా పర్వదినాన కొత్త, పాత అనే తేడాలేకుండా ప్రతీ వాహనానికీ పూజలు చేస్తారు. కొందరు గుడికి వెళ్తే.. మరికొందరు ఇంటి వద్దనే తమకు తెలిసిన రీతిలో వాహన పూజ చేస్తారు. అయితే.. అసలైన పద్ధతిలో పూజ ఎలా చేయాలో మీకు తెలుసా..?
భారతీయ సంస్కృతి, సంప్రదాయాలలో వాహన పూజ అత్యంత ముఖ్యమైనది. ఇనుము కొందరికి కలిసి వస్తుంది.. మరి కొందరి విషయంలో తేడా కొడుతుందనే భావన కూడా చాలా మందిలో ఉంటుంది. అందుకే.. కొత్త వాహనం కొనుగోలు చేస్తే.. తప్పకుండా తమ ఇష్టదైవం ఆలయానికి తీసుకెళ్లి పూజ చేయిస్తారు. భవిష్యత్తులో ఎలాంటి దుర్ఘటనలు జరగకుండా.. వాహన ప్రయాణం సుఖంగా, సౌఖ్యంగా సాగాలనే ఉద్దేశ్యంతో ఈ పూజలు జరిపిస్తుంటారు.
ఆలయానికి వెళ్లి పూజ జరిపిస్తే.. అక్కడ పూజారి ఉంటారు. అయితే.. పండుగ వేళ వాహనాలను చక్కగా శుభ్రం చేసిన తర్వాత.. పసుపు, కుంకుమలతో ఇంటి వద్దనే కొందరు పూజ చేస్తారు. అయితే.. సరైన పూర్తి పద్ధతి అందరికీ తెలిసి ఉండకపోవచ్చు. అలాంటి వారికోసం విజయదశమి నేపథ్యంలో వాహన పూజ ఎలా నిర్వహించాలో మీకోసం ఇక్కడ అందిస్తున్నాం. ఈ పూజా విధానాన్ని అనుసరించి.. అమ్మవారి ఆశీస్సులు అందుకోండి.
వాహన పూజా విధానం ఇలా :
- ముందుగా వాహనాన్ని శుభ్రంగా కడగండి.
- ఆ తర్వాత కలశంలో మంచి నీళ్లు తీసుకొని.. మామిడి ఆకుతో వాహనంపై మూడుసార్లు చల్లండి.
- ఆ తర్వాత వాహనంపై స్వస్తిక్ గుర్తు వేయండి.
- ఇప్పుడు వాహనానికి పూలమాల వేయాలి.
- ఆ తర్వాత వాహనానికి కలవా(చేతికి చుట్టుకునే ఎరుపు దారం)ను మూడు రౌండ్లు చుట్టండి. దీన్ని రక్షాకవచంగా భావిస్తారు.
- ఇప్పుడు కర్పూరంతో హారతి వెలిగించి వాహనం ముందు మూడుసార్లు తిప్పండి.
- తర్వాత కలశంలోని నీటిని వాహనం ముందు కుడి ఎడమ వైపునకు పోయాలి. ఇలా చేయడం.. వాహనాన్ని స్వాగతించడం.
- ఇప్పుడు కర్పూరం బూడిదతో వాహనానికి తిలకం దిద్దాలి. ఇది వాహనాన్ని దిష్టి నుండి కాపాడుతుంది.
- ఇప్పుడు వాహనంపై స్వీట్లు పెట్టి.. కాసేపటి తర్వాత వాటిని తీసి గోమాతకు తినిపించాలి.
- ఇప్పుడు కొబ్బరికాయ కొట్టాలి. వాహనం ముందు మొత్తం ఏడుసార్లు తిప్పి ఆ తర్వాత కొబ్బరికాయ కొట్టాలి.
- తర్వాత వాహనానికి అంతా మంచే జరగాలనే ఉద్దేశ్యంతో.. ఇనుప చువ్వకు గవ్వలు తొడిగి దాన్ని వాహనం ముందు భాగంలో కట్టండి.
- ఆకాశంలో ఎగురుతున్న హనుమంతుడి చిత్రాన్ని వాహనం లోపలగానీ, బయటక కానీ వేలాడదీయండి.
- వాహనం ముందు, వెనకా విఘ్నాధిపతి వినాయకుడి చిత్రాన్ని ప్రతిష్టించండి.
- ఆఖరుగా చక్రాల కింద నిమ్మకాయలు పెట్టి ముందుకు సాగిపొండి.
- మీ ప్రయాణం సుఖంగా సాగుతూ సంతోషంగా గమ్యం చేరుతుందని పురాణోక్తి.