తెలంగాణ

telangana

ETV Bharat / bharat

చైనాకు ఆ రాత్రి చుక్కలు చూపించిన భారత్​ - భారత్​ చైనా తాజా వార్తలు

ప్రత్యర్థులతో బేరాలకు దిగాలంటే వారికి సంబంధించినవి ఏవో ఒకటి మన వద్ద ఉండాలి.. సాధారణంగా పొరుగు దేశం చైనా ఈ సూత్రం అనుసరిస్తుంది. పొరుగు దేశాల భూభాగాలు ఆక్రమించి అప్పుడు చర్చల నాటకానికి తెరతీస్తుంది. చైనా తీరుతో సహనం నశించిన భారత సైన్యం తాను కూడా ఓ రెండడుగులు ముందుకు వేసి కైలాస్‌ రేంజిపై పట్టు సాధించింది. అసలు ఆరోజు రాత్రి ఏం జరిగింది?

china
చైనాకు ఆ రాత్రి చుక్కలు చూపించిన భారత్​

By

Published : Dec 16, 2020, 1:44 PM IST

భారత సైన్యం అక్కడో చుక్క.. ఇక్కడో చుక్క పెట్టినట్లు పొంతన లేకుండా వ్యవహరించింది. ఆగస్టు 29-30 రాత్రి ఆ చుక్కల మొత్తాన్ని కలిపి చైనాకు అసలు బొమ్మ చూపించింది. ఆ చిత్రాన్ని చూసిన డ్రాగన్‌ అదో పద్మవ్యూహమని అర్థం చేసుకొని షాక్‌కు గురైంది.

ప్రత్యర్థులతో బేరాలకు దిగాలంటే వారికి సంబంధించినవి ఏవో ఒకటి మన వద్ద ఉండాలి.. సాధారణంగా పొరుగు దేశం చైనా ఈ సూత్రం అనుసరిస్తుంది. పొరుగు దేశాల భూభాగాలు ఆక్రమించి అప్పుడు చర్చల నాటకానికి తెరతీస్తుంది. ఆ తర్వాత ఆక్రమించుకొన్న దానిలో కొంత భూభాగం వెనక్కి ఇచ్చి మిగిలినదానిని మింగేస్తుంది. రెండడుగులు ముందుకు.. ఒక అడుగు వెనక్కి సూత్రం అన్నమాట..! భారత్‌ దగ్గర కూడా పాంగాంగ్‌ సరస్సు వద్ద శిఖరాలు, డెప్సాంగ్‌ మైదానాలు వంటి ప్రాంతాలను ఆక్రమించి ఇలాంటి సూత్రాన్నే అనుసరించాలనుకుంది. కానీ, చైనా తీరుతో సహనం నశించిన భారత సైన్యం తాను కూడా ఓ రెండడుగులు ముందుకు వేసి కైలాస్‌ రేంజిపై పట్టు సాధించింది. ఇప్పుడు రాజీ అంటే ఇద్దరూ రెండడగులు వెనక్కి వేయాల్సిందే. ఇదే చైనాకు మింగుడుపడటంలేదు. అంతకంటే ఎక్కువగా.. ఆగస్టులో భారత్‌ కైలాస్‌ రేంజిని ఆక్రమించిన తీరు దానికి నిద్రపట్టనివ్వడంలేదు. భారత్‌ మాత్రం మరో సియాచిన్‌ తరహాలో శీతాకాలాన్ని ఎదుర్కొనేందుకు ఏర్పాట్లు చేసుకుపోతోంది. సరైన రాజీ ఫార్ములా లేకపోతే వెనక్కి తగ్గేదే లేదని భారత్‌ తెగేసి చెబుతోంది. దీంతో చర్చలు కొలిక్కి రావడంలేదు.

నెలల ముందు నుంచి ఏర్పాట్లు..

హిమాలయ పర్వతాల్లో చైనాతో ఘర్షణ వాతావరణం తలెత్తగానే భారత్‌ ఒక్కసారిగా అప్రమత్తమైంది. చైనా తీరు చూస్తుంటే అంత తేలిగ్గా వెనక్కి తగ్గేట్లు లేదని భారత్‌కు అర్థమైంది. దీంతో చైనాతో బలంగా బేరం చేసే శక్తిని సాధించేందుకు ఉన్న అవకాశాలను గుర్తించాలని ప్రభుత్వం సైన్యాన్ని పురమాయించింది. వాస్తవాధీన రేఖ వద్ద కొన్ని ప్రదేశాల్లో భారత్‌ పైచేయి సాధిస్తే చైనాను దారిలోకి తీసుకురావచ్చని సైన్యం గుర్తించడంతో ప్రభుత్వం కూడా దానికి పచ్చజెండా ఊపింది. దీంతో పశ్చిమ బెంగాల్‌లోని పనఘడ్‌ మౌంటెన్‌ స్ట్రైక్‌ కోర్‌ (పర్వత యుద్ధతంత్ర యోధులు)ను రంగంలోకి దించింది. దీంతోపాటు ఉత్తరాఖండ్‌ చక్రాతలోని స్పెషల్‌ ఫ్రాంటియర్‌ ఫోర్స్‌(ఎస్‌ఎఫ్‌ఎఫ్‌) కూడా రంగంలోకి దిగింది.

కేవలం ఒకే విమానంలో..
ఆగస్టు నెల మొదట్లో మౌంటేన్‌ స్ట్రైక్‌ కోర్‌(ఎంఎస్‌సీ)లోని ఒక బృందాన్ని 24గంటల్లో సిద్ధం కావాలని ఆదేశించింది. సైనికుల వద్ద వారి వ్యక్తిగత సాధనా సంపత్తి తప్ప ఎటువంటి పెద్ద ఆయుధాలు లేకుండా జాగ్రత్తపడాలని ఆదేశించింది. లెఫ్టినెంట్‌ జనరల్‌ సవ్‌నీత్‌ సింగ్‌ నేతృత్వంలోని బృందం ఆగమేఘాలపై లద్దాఖ్‌ చేరుకొంది. ఇందుకు ఒకే విమానం ఉపయోగించినట్లు సమాచారం. భారత్‌ వైపు భారీగా దళాల కదలిక ఉంటే తేలిగ్గా చైనా పసిగట్టేస్తుంది. ప్రధానంగా డ్రాగన్‌ ఉపగ్రహాల కళ్లుగప్పడం కోసమే ఇలా చేశారు. దీంతో ఎంఎస్‌సీ దళం ఎటువంటి అసాధారణ ఆయుధాలు లేకుండా రావడంతో చైనాకు అనుమానం రాలేదు. చైనా కన్నుగప్పేందుకు ఎంఎస్‌సీ, ఎస్‌ఎఫ్‌ఎఫ్‌ దళాలు కూడా లక్ష్యం వైపు కాకుండ వేర్వేరు ప్రదేశాల్లో తిరిగాయి. దీనికి తోడు భారత్ అదనపు దళాల తరలింపు ప్రక్రియ కూడా అదే సమయంలో జరిగింది. దీంతో భారత్‌ కైలాశ్‌ రేంజిపై కాకుండా మరెక్కడో తన దృష్టి సారించిందని చైనా భావించింది. భారత్‌కు కావాల్సింది అదే.

అసలు బొమ్మ కళ్లకు కనిపించిందప్పుడే..

ఆగస్టు 29-30 అర్ధరాత్రి ఆపరేషన్‌ మొదలైంది. వేర్వేరు ప్రదేశాల్లో ఉన్న దళాలు, ఆయుధాలు, ఇతర వనరులు ఒక దగ్గరకు చేరాయి. ఈ దళాలు మెరుపు వేగంతో కైలాస్‌ రేంజిగా పేరున్న పాంగాంగ్‌ సరస్సు దక్షిణ భాగంలోని శిఖరాలను స్వాధీనం చేసుకొన్నాయి. ఆగస్టు చివరి వరకు ఈ శిఖరాలు భారత్‌, చైనాల స్వాధీనంలో లేవు. వీటిల్లో రెచిన్‌ లా, రజాంగ్‌లా శిఖరాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ స్పంగూర్‌ గ్యాప్‌ ప్రాంతంపై భారత్‌కు పట్టు పెంచాయి. చైనా స్థావరాలు ఉన్న మాల్డో గారిసన్‌పై ఈ శిఖరాల నుంచి గురిపెట్టవచ్చు. దీంతో చైనా ఆధిపత్యం ఒక్కసారిగా చేజారింది. దీంతో చైనా దృష్టి పాంగాంగ్‌ దక్షిణ శిఖరాలవైపు మళ్లిన సమయంలో పారాఎస్‌ఎఫ్‌కు చెందిన ఓ చిన్న దళం ఫింగర్‌-4పై చైనా దళాల ఉన్న ప్రదేశం కంటే ఎత్తయిన చోటుకు చేరుకుంది. అక్కడి నుంచి కింద ఉన్న చైనాపోస్టు స్పష్టంగా కనిపిస్తుంది. సెప్టెంబర్‌ మొదటి వారంలో ఈ విషయం బాహ్యప్రపంచానికి తెలిసింది. నాటి నుంచి జరిగిన కోర్‌ కమాండర్ల స్థాయి చర్చల్లో చైనా కైలాస్‌ రేంజి నుంచి ఉపసంహరణ అంశాన్ని తీసుకొస్తూనే ఉందంటే భారత్‌ ఆధిపత్యం అర్థం చేసుకోవచ్చు. భారత్‌ ఆ శిఖరాలపైకి సాయుధ వాహనాలు, యుద్ధ ట్యాంకులను కూడా చేర్చడంతో చైనాపై ఒత్తిడి పెరిగింది.

ABOUT THE AUTHOR

...view details