Honor killing in UP: ఉత్తర్‌ప్రదేశ్‌లోని మెయిన్‌పురి జిల్లాలో పరువు హత్య కలకలం రేపింది. ప్రేమ వివాహం జరిగిన ఆరు రోజులకే యువకుడి హత్య జరిగింది. పెళ్లి కూతురు సోదరుడు, తండ్రి కలిసి యువకుడిని తుపాకీతో కాల్చి చంపేశారు. ఈ కాల్పుల్లో యువకుడి కుటుంబ సభ్యులకు తీవ్ర గాయాలయ్యాయి.
వివరాల్లోకి వెళితే..:కోమల్ అనే యువతి స్థానికంగా ఉండే భరత్వాల్ అనే యువకుడితో ప్రేమలో పడింది. కులాలు వేరైనప్పటికీ.. ప్రేమకు అవి అడ్డు కాదని భావించింది. యువకుడి కుటుంబ సభ్యులు పెళ్లికి ఒప్పుకున్నప్పటికీ... యువతి కుటుంబ సభ్యులు వివాహానికి ససేమిరా అన్నారు. అయినప్పటికీ యువతీయువకులు వివాహంపై ముందడుగు వేశారు. యువకుడి కుటుంబ సభ్యుల సమక్షంలోనే ఏప్రిల్ 20న ఇరువురూ వివాహం చేసుకున్నారు. ఇది జరిగిన తర్వాత యువతి తండ్రి, సోదరుడు కోపంతో రగిలిపోయారు. ఈ క్రమంలోనే హత్యకు తెగబడ్డారు. మంగళవారం మిట్ట మధ్యాహ్నం యువకుడిపై కాల్పులు జరిపి పొట్టనబెట్టుకున్నారు. బాధితుడి నుదిటికి తూటాలు తగిలినట్లు తెలుస్తోంది. కాల్పుల అనంతరం నిందితులు పారిపోయారు.
సమాచారం అందగానే భారీ సంఖ్యలో పోలీసులు ఘటనా స్థలికి వచ్చారు. బాధితులను ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడ్డ యువకుడిని స్థానిక ఆస్పత్రి నుంచి సఫాయి మెడికల్ కళాశాలకు హుటాహుటిన పంపించారు. ఈ క్రమంలోనే అతడు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. అనంతరం యువకుడి మృతదేహాన్ని శవపరీక్షల నిమిత్తం తరలించారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు.