తెలంగాణ

telangana

ETV Bharat / bharat

14 కాదు 7 రోజులే.. కరోనా హోం ఐసోలేషన్​కు కేంద్రం కొత్త రూల్స్

Home Isolation Guidelines: దేశంలో కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో.. స్వల్పస్థాయి లేదా కొవిడ్ లక్షణాలు లేనివారు హోం ఐసోలేషన్​లో ఉండేందుకు నూతన మార్గదర్శకాలను జారీచేసింది కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ. హోం ఐసోలేషన్ గడువును 14 రోజుల నుంచి 7రోజులకు తగ్గించింది. కొవిడ్ సోకిన వ్యాక్తి ఏడు రోజుల్లో డిశ్ఛార్జ్​ కావొచ్చని తెలిపింది.

Home Isolation
హోం ఐసోలేషన్

By

Published : Jan 5, 2022, 1:48 PM IST

Updated : Jan 5, 2022, 4:26 PM IST

Corona Home Isolation Guidelines: దేశంలో కొవిడ్-19 ఉద్ధృతి దృష్ట్యా.. తేలికపాటి లక్షణాలతో గృహ నిర్బంధంలో ఉండేవారికి కేంద్రం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. హోం ఐసోలేషన్​ గడువును 14 నుంచి 7 రోజులకు తగ్గించింది.

ఈ ఏడు రోజుల్లో వరుసగా మూడు రోజులు జ్వరం రాకపోయినా.. హోం ఐసోలేషన్​ నుంచి డిశ్ఛార్జ్ కావొచ్చని పేర్కొంది. గృహనిర్బంధం పూర్తయ్యాక మళ్లీ కొవిడ్-19 పరీక్ష అవసరం లేదని సూచించింది. ఈ మేరకు గతంలో ఉన్న నిబంధనలను సవరిస్తూ.. తాజా సూచనలు చేసింది.

హోం ఐసోలేషన్​కు ఎవరు అర్హులు?

  • గృహ నిర్బంధంలో ఉండే వ్యక్తికి తేలికపాటి లక్షణాలు ఉన్నట్లు వైద్యాధికారి ధ్రువీకరించాలి. స్వీయ నిర్బంధంతో పాటు కుటుంబం క్వారంటైన్​లో ఉండేందుకు తగిన సదుపాయాలు ఉండాలి. స్వీయ నిర్బంధంలో ఉంటున్నట్లు అండర్​టేకింగ్ ఫారాన్ని సమర్పించాలి.
  • 24 గంటలు సంరక్షకుడు అందుబాటులో ఉండాలి. సంరక్షకుడికి కొవిడ్​-19 వ్యాక్సినేషన్ రెండు డోసులు పూర్తయి ఉండాలి.
  • 60ఏళ్లు పైబడిన వృద్ధులు, ఇతర దీర్ఘకాలిక వ్యాధిగస్థులు.. సంబంధిత మెడికల్ అధికారి సలహా మేరకే హోం ఐసోలేషన్​లో ఉండాలి.
  • కరోనా బాధితుడు హోం ఐసోలేషన్​లో ఉన్నప్పుడు.. ఇంట్లోని మిగతా కుటుంబసభ్యులు హోం క్వారంటైన్ నిబంధనలను పాటించాలి.

రోగి పాటించాల్సినవి..

  • తప్పనిసరిగా ప్రత్యేక గదిలోనే ఉండాలి. ఇతరులతో ముఖ్యంగా వృద్ధులు, ఇప్పటికే అనారోగ్యంతో ఉన్నవారికి దూరంగా ఉండాలి.
  • అన్ని వేళల్లో సర్జికల్​ మాస్కు ధరించటం తప్పనిసరి. 8 గంటల తర్వాత లేదా తడిగా మారితే తొలగించాలి. దానిని ఆల్కహాల్ ద్రావణంతో శుభ్రపరిచిన తర్వాతే పడేయాలి.
  • రోగి తప్పకుండా విశ్రాంతి తీసుకోవాలి. ద్రవ పదార్థాలను అధికంగా తీసుకోవాలి.
  • తరచూ చేతులను 40 సెకన్లపాటు సబ్బుతో కడగాలి. లేదా ఆల్కహాల్ ఆధారిత శానిటైజర్​ వాడాలి.
  • వ్యక్తిగత వస్తువులను ఇతరులకు ఇవ్వకూడదు. గదిలో తరచూ తాకే వస్తువులు, ఉపరితలాలను ఒక శాతం హైపోక్లోరైట్​ ద్రావణంతో శుభ్రం చేస్తూ ఉండాలి.
  • వైద్యుల సూచనలను పాటిస్తూ మందులను క్రమం తప్పకుండా వేసుకోవాలి. శరీర ఉష్ణోగ్రత, వ్యాధి లక్షణాలను ఎప్పటికప్పుడు సరిచూసుకోవాలి.

సంరక్షకుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

  • రోగితో ఉన్నప్పుడు మూడు పొరల మెడికల్ మాస్కు ధరించాలి. దానిని ముట్టుకోరాదు. మాస్కు తడిసిపోతే వెంటనే తొలగించాలి.
  • ముఖం, ముక్కు, నోటిని ముట్టుకోకూడదు. తరచూ చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. అనంతరం టవల్​ లేదా టిష్యూ పేపర్​తో తుడుచుకోవాలి.
  • రోగి శరీర ద్రవాలను తాకవద్దు. ముఖ్యంగా నోరు, శ్వాసకోశాల నుంచి వచ్చే బిందువులను మన మీద పడనీయకూడదు.
  • రోగికి వారి గదిలోనే భోజన ఏర్పాట్లు చూడాలి. వారు వాడిన పాత్రలను గ్లౌజులు వేసుకుని సబ్బుతో శుభ్రంగా కడగాలి.
  • పరిసరాలు శుభ్రం చేసేటప్పుడు, రోగికి దుస్తులు మార్చేటప్పుడు మాస్కుతో పాటు గ్లవ్స్​ కూడా ధరించాలి. వాటిని వేసుకునే ముందు, తర్వాత చేతులను శుభ్రంగా కడగాలి.
  • రోజువారీగా ఆరోగ్యం, శరీర ఉష్ణోగ్రతను సరిచూసుకోవాలి. ఏదైనా లక్షణాలు బయటపడితే వెంటనే వైద్య సాయం పొందాలి.

హోం ఐసోలేషన్​లో చికిత్స ఎలా?

  • లక్షణాలు తీవ్రమవుతుంటే వెంటనే వైద్యుడ్ని సంప్రదించాలి.
  • గోరు వెచ్చని నీటిని పుక్కిలించాలి. రోజుకు మూడుసార్లు ఆవిరి పట్టాలి.
  • ట్యాబ్లెట్లకు జ్వరం తగ్గకపోతే వైద్యుడిని సంప్రదించాలి.

ఇదీ చూడండి:విజృంభిస్తున్న కరోనా.. ఆ రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ

Last Updated : Jan 5, 2022, 4:26 PM IST

ABOUT THE AUTHOR

...view details