HIV positive man hides status: హెచ్ఐవీ సోకిందన్న విషయాన్ని తనకు చెప్పకుండా దాచాడని భర్తపై ఫిర్యాదు చేసింది ఓ మహిళ. తన వద్దనున్న బంగారం అంతా తీసుకొని.. ఇంటి నుంచి గెంటేశాడని ఆరోపించింది. కర్ణాటకలోని బెంగళూరులో జరిగిందీ ఘటన. హెచ్ఐవీ విషయం తెలిసిన తర్వాత కూడా అతడితోనే ఉంటున్నా.. బయటకు గెంటేశాడని బాధితురాలు బసవనగుడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఇంజినీర్ అయిన ఆమె భర్తపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు.
వారు తెలిపిన వివరాల ప్రకారం.. వీరిద్దరికీ 2018 మార్చి 12న వివాహం జరిగింది. హనీమూన్‌కు వెళ్లిన సమయంలో కడుపునొప్పి కారణంగా.. వీరిద్దరి మధ్య లైంగిక సంపర్కం జరగలేదు.
తిరిగి వచ్చిన అనంతరం.. తన భర్త వరకట్నం కోసం వేధించాడని ఆమె తెలిపింది. కంప్యూటర్ కోర్స్ నేర్చుకుంటానని తన తండ్రిని నమ్మించి.. లక్షల రూపాయలు తీసుకున్నాడని ఆరోపించింది. అదే సమయంలో.. బాధితురాలికి ఇంట్లో అతడి మెడికల్ రిపోర్ట్ కనిపించింది. అందులో తన భర్తకు హెచ్ఐవీ పాజిటివ్ అని తెలిసి షాకయ్యింది. తర్వాత ఆమెకు కూడా పాజిటివ్‌గా తేలింది. పెళ్లికి ముందు తన భర్త ఈ విషయం చెప్పలేదని తొలుత పోలీసులను ఆశ్రయించింది.
''ఇతర మహిళలతో సంబంధం పెట్టుకున్నందుకు హెచ్ఐవీ సోకిందా? లేదా? అన్నది నా భర్త ఇప్పటివరకు నాకు చెప్పలేదు. అతడితో ఉన్నందుకు నాకు కూడా ఇప్పుడు హెచ్ఐవీ సోకింది.''