ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్(ఏఐ).. ప్రస్తుత కాలంలో ఈ పదం ఎక్కువగా వినిపిస్తోంది. ఈ సాంకేతికత వాడుకుని వినూత్న ఆవిష్కరణలకు శ్రీకారం చూడుతున్నారు కొందరు. అయితే, ఇప్పుడు ఏఐ మరింత అభివృద్ధి చెందింది. మనిషి సామర్థ్యానికే సవాల్ విసురుతున్న ఈ సాంకేతికతతో.. ఇటీవల చాట్‌జీపీటీ అంటూ.. ఓ చాట్‌బాట్ సంచలనం సృష్టించింది. అదే సాంకేతికతకు క్రియోటివిటీ జోడించాడో కళాకారుడు. మహాత్మాగాంధీ, అంబేడ్కర్, చెగువేరా, మదర్ థెరెసా, అబ్రహాం లింకన్ లాంటి మహోన్నత వ్యక్తుల సెల్ఫీలు క్రియేట్ చేశారు. అదేలాగో తెలుసా!
వావ్.. గాంధీ, నెహ్రూ, అంబేడ్కర్ సెల్ఫీలు చూశారా?.. అంతా AI మహిమ గురూ!
సాంకేతికతకు క్రియేటివిటీ జోడించి మహాత్మా గాంధీ, సుభాశ్ చంద్రబోస్, మదర్ థెరెసా, అబ్రహం లింకన్ లాంటి ప్రముఖుల సెల్ఫీలు క్రియేట్ చేశారు ఓ కళాకారుడు. ప్రముఖలు సెల్ఫీలు తీసుకుంటే ఎలా ఉంటారో చూడాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే.
సెల్ఫోన్లు లేని రోజుల్లో ప్రముఖ వ్యక్తులు.. సెల్ఫీలు తీసుకుంటే ఎలా ఉంటారు? అనే ఆలోచన వచ్చింది కేరళకు చెందిన జో జాన్ ముల్లోర్ అనే కళాకారుడికి. అనుకున్నదే తడవుగా ఆలోచనను ఆచరణలో పెట్టారు. ఏఐ సాంకేతికతకు క్రియేటివిటీ జోడించారు. 'మిడ్ జర్నీ' అనే సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి అలనాటి ప్రముఖులు.. మహాత్మా గాంధీ, నేతాజీ సుభాశ్ చంద్రబోస్, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, మదర్ థెరెసా, విప్లవ నేత కార్ల్ మార్క్స్, ఎర్నెస్టో చెగువేరా, బాబ్ మార్లే లాంటి తదితర వ్యక్తుల చిత్రాలు తయారు చేశారు. అలా చేసిన ఫొటోలకు రీపెయింట్ వేయడానికి 'ఫొటో షాప్' సాఫ్ట్వేర్ సహాయం తీసుకున్నారు. హిస్టారికల్ సెల్ఫీస్ అని ఓ సిరీస్ తీసుకొచ్చారు. వాటిని చూస్తే వారంతా నిజంగా సెల్ఫీలు తీసుకున్నారా అనిపిస్తుంది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియా సైట్లలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.
జో జాన్.. ఆయన హార్డ్ డ్రైవ్‌లో తన స్నేహితులు పంపించిన పాత ఫొటోలను రీపెయింట్ చేసి.. వాటిని తలదన్నేలా కొత్త ఫొటోలు క్రియేట్ చేశారు. అలా ఈ హిస్టారికల్ సెల్ఫీస్ సిరీస్‌కు శ్రీకారం చుట్టారు. ఈ ఫార్మాట్లో ఒక ఫొటోను రూపొందించడానికి మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుందని జాన్ చెప్పారు. ఇలాంటి ఫొటోలు క్రియేట్ చేయడం అంటే తనకు చాలా ఇష్టమని తెలిపారు. అయినా క్రియేటివ్‌గా ఫొటోలు తయారుచేయడమే తనకు ఆనందమని జాన్ పేర్కొన్నారు. జాన్.. 17 ఏళ్లు దుబాయ్‌లో ఉన్నారు. ఆ సమయంలో దుబాయ్ మొత్తాన్ని పచ్చదనంతో నింపేస్తే ఎలా ఉంటుందనే ఫొటో క్రియేట్ చేశారు. దాన్ని ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ కూడా ప్రసారం చేసింది. ఇవే కాకుండా సినిమా స్టార్ల ఫొటోలు, మెస్సీ చిన్నప్పటి ఫొటోలు కూడా క్రియేట్ చేశారు. జాన్‌కు భార్య డింబుల్, కుమార్తె జొనా ఉన్నారు.