తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'హిజాబ్ ఆందోళనల వెనక భారీ కుట్ర.. ఆ సంస్థే కారణం'

కర్ణాటకలో హిజాబ్ నిరసనలు కుట్ర ప్రకారమే జరిగాయని ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీకోర్టుకు తెలిపింది. నిరసనల వెనక పీఎఫ్ఐ హస్తం ఉందని ఆరోపించింది.

hijab-case-supreme-court
hijab-case-supreme-court

By

Published : Sep 20, 2022, 9:58 PM IST

హిజాబ్ ధారణకు అనుకూలంగా కర్ణాటకలో జరిగిన నిరసనల వెనక ఇస్లాం సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ) హస్తం ఉందని సుప్రీంకోర్టుకు కర్ణాటక ప్రభుత్వం తెలిపింది. నిరసనలు దానికవే చెలరేగలేదని భారీ కుట్రలో భాగంగానే పీఎఫ్ఐ జరిగాయని ఆరోపించింది. ప్రజల మతపరమైన భావాలను ఆధారంగా చేసుకొని ఆ సంస్థ సోషల్ మీడియాలో ప్రచారాలు నిర్వహించిందని కర్ణాటక ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు.

'పీఎఫ్ఐ సంస్థ సామాజిక మాధ్యమాల్లో క్యాంపెయిన్ ప్రారంభించింది. విద్యార్థులందరినీ హిజాబ్ ధరించాలని కోరింది. ఇదేదీ(నిరసనలు) అప్పటికప్పుడు కొంతమంది విద్యార్థులు ప్రారంభించింది కాదు. ఇవి భారీ కుట్రలో భాగమే. విద్యార్థులు వారికి వచ్చిన సూచనల ఆధారంగానే నడుచుకున్నారు. గతేడాది వరకు కర్ణాటకలోని స్కూళ్లలో ఏ బాలిక కూడా హిజాబ్ ధరించలేదు. హిజాబ్ ధరించకూడదని చెప్పి ఒక మతానికి వ్యతిరేకిస్తున్నారని అనుకోవడం సరికాదు' అని తుషార్ మెహతా వివరించారు.

సమానత్వం, సమగ్రతకు భంగం కలిగే దుస్తులు ధరించకూడదని కర్ణాటక ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో ఎలాంటి సమస్య లేదని మెహతా అన్నారు. అది మతపరంగా తటస్థ నిర్ణయమని పేర్కొన్నారు. హిజాబ్ వివాదం చెలరేగిన సమయంలోనే మరో వర్గానికి చెందిన కొందరు కాషాయ కండువా కప్పుకొని వచ్చారని, అది కూడా నిబంధనలకు విరుద్ధమేనని స్పష్టం చేశారు. కాగా, ఈ అంశంపై బుధవారం వాదనలు కొనసాగనున్నాయి.

విద్యాసంస్థల్లో హిజాబ్‌పై నిషేధాన్ని తొలగించడానికి నిరాకరిస్తూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు వాదనలు వింటోంది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 25 ప్రకారం హిజాబ్‌ ధరించడం తప్పనిసరి ధార్మిక విధానం కాదని ఇటీవల కర్ణాటక హైకోర్టు స్పష్టంచేసింది. తరగతి గదుల్లో హిజాబ్ ధరించేందుకు అనుమతి ఇవ్వాలని ఉడుపికి చెందిన కొందరు విద్యార్థినులు దాఖలు చేసిన పిటిషన్లను కొట్టివేసింది. హైకోర్టు తీర్పును అనేక మంది సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో వ్యాజ్యాలు దాఖలు చేశారు.

ABOUT THE AUTHOR

...view details