తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Heavy Rains in AP: తడిసి ముద్దవుతున్న ఏపీ.. మరో రెండు రోజులు వర్షాలు - ఏపీలో మరో రెండు రోజులు కురిసే అవకాశం

Heavy Rains in AP: విస్తారంగా కురుస్తున్న వర్షాలకు ఆంధ్రప్రదేశ్ తడిసి ముద్దవుతోంది. కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. అనేక మండలాల్లో రోజంతా జల్లులు పడుతూనే ఉన్నాయి. వర్షాల ధాటికి రోడ్లపై నీరు ప్రవహించడంతో విద్యార్థులు, ఉపాధి కూలీలు, ఉద్యోగులు తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు.

Etv Bharat
Etv Bharat

By

Published : Jul 26, 2023, 10:47 PM IST

తడిసి ముద్దవుతున్న ఏపీ

Heavy Rains in AP : ఆంధ్రప్రదేశ్​లో పశ్చిమ బంగాళాఖాతంపై బలమైన అల్పపీడనం కొనసాగుతుండటంతో కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఏలూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. రాత్రి నుంచి వర్షం పడుతుండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రహదారులపై వర్షం నీరు ప్రవహిస్తుండటంతో స్థానికులు, వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. రోడ్డుపై ఎక్కడ గోతులు ఉన్నాయో తెలియక.. వాహనదారులు ఆందోళనకు గురవుతున్నారు. రోడ్డుపై నిలిచిన నీటిలోనే నడుచుకుంటూ విద్యార్థులు పాఠశాల వెళుతున్నారు. ఫత్తేబాద రైతు బజార్​లోకి వర్షం నీరు చేరడంతో వినియోగదారులు, కొనుగోలుదారులు తీవ్ర అవస్థలు పడ్డారు. మోకాళ్ల లోతు నీటిలోనే కొనుగోళ్లు సాగించారు. వర్షాల ధాటికి జిల్లాలోని అనేక కార్యాలయాలు, పాఠశాలలు నీట మునిగాయి.

జలదిగ్బంధమైన రహదారులు.. వాహనదారులకు ఇబ్బందులు :ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో అల్లూరి జిల్లా రంపచోడవరం మన్యంలో వాగులు, వంకలు పొంగిపోర‌్లుతున్నాయి. అనేక చోట్ల కొండ చరియలు విరిగి పడ్డాయి. రంపచోడవరం నుంచి మారేడుమిల్లి వెళ్లే ప్రధాన రహదారి జలదిగ్బంధమైంది. భూపతిపాలెం జలాశయం వద్ద, దేవీపట్నం వెళ్లే రహదారిలో సుక్కరాతి గండి వద్ద కొండ చర్యలు విరిగిపడ్డాయి. వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

పాఠశాలలకు స్వచ్ఛందంగా సెలవులు :నెల్లూరులో మూడు రోజులుగా కరుస్తున్న వర్షాలకు గుంతల్లో మోకాళ్ల లోతులో వర్షపు నీరు చేరింది. దీంతో ప్రమాదకర రోడ్లపై రాకపోకలు సాగించేందుకు ప్రజలు అవస్థలు పడుతున్నారు. నంద్యాలలో భారీ వర్షానికి పట్టణంలోని పలు రోడ్లు జలమయం అయ్యాయి. అనేక ప్రైవేట్ పాఠశాలలకు స్వచ్ఛందంగా యాజమాన్యాలు సెలవులు ప్రకటించింది. వర్షాల ధాటికి నెల్లూరులోని నీలివీధిలో... ఓ రేషన్ దుకాణం ముందు భాగంలోని పైకప్పు కూలిపోయింది.

వర్షంలో విధులు నిర్వహిస్తున్న కార్మికులు :రాయలసీమ జిల్లాల్లోనూ వర్షాలు కురుస్తున్నాయి. కర్నూలుతో పాటు ఆదోని, ఎమ్మిగనూరులోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. కడపలో మంగళవారం సాయంత్రం నుంచి భారీ వర్షం కురుస్తుండటంతో ఆర్టీసీ గ్యారేజీలోకి నీరు చేరాయి. తప్పనిసరి పరిస్థితుల్లో కార్మికులు నీటిలోనే విధులు నిర్వహిస్తున్నారు. ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలోకి నీరు చేరడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. కడపలోని లోహియా నగర్, రామరాజుపల్లి, అల్లూరి సీతారామరాజు నగర్, నంద్యాల నాగిరెడ్డి కాలనీ, భరత్‌ నగర్‌ కాలనీల్లో రోడ్లపై వర్షపు నీరు ప్రవహిస్తున్నాయి. వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన నగరపాలక సిబ్బంది రోడ్లపై నిలిచి ఉన్న నీటిని తొలగిస్తున్నారు.

అధికారుల సూచన :మరో రెండు రోజులు పాటు ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details