మంచి పర్యావరణంపైనే చిన్నారుల బంగారు భవిష్యత్తు ఆధారపడి ఉందని, దానిని ప్రమాదంలోకి నెట్టే అధికారం మనకు లేదని భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఉద్ఘాటించారు. ప్రపంచ బాలల దినోత్సవం సందర్భంగా యూనిసెఫ్‌తో కలిసి ‘పార్లమెంటేరియన్స్ గ్రూఫ్ ఫర్ చిల్డ్రన్స్’ సంస్థ శుక్రవారం నిర్వహించిన ‘క్లైమేట్ పార్లమెంట్ విత్ చిల్డ్రన్’ అనే ఆన్‌లైన్ వెబినార్‌ను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.
'చిన్నారుల భవితను ప్రమాదంలోకి నెట్టొద్దు' - వెంకయ్య నాయుడు వ్యాఖ్యలు
చిన్నారుల బంగారు భవిష్యత్తు.. చుట్టూ ఉండే మంచి పర్యావరణంపై ఆధారపడి ఉంటుందని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. దానిని ప్రమాదంలోకి నెట్టే అధికారం పెద్దలకు లేదని పేర్కొన్నారు. ఈ మేరకు ఓ వెబ్‌నార్‌లో మాట్లాడారు.
‘‘పర్యావరణ మార్పులతోపాటు అనారోగ్యం, పౌష్టికాహార లోపంలాంటి సమస్యలు చిన్నారుల పాలిట ప్రాణాంతకంగా మారాయి. పర్యావరణ పరిరక్షణలో వారిని భాగస్వాములను చేయాలి. పర్యావరణ మార్పులు, దాని ప్రభావం, పరిష్కార చర్యల గురించి పాఠశాల స్థాయినుంచే పిల్లలను చైతన్యవంతుల్ని చేయాలి. బాల్యంలో స్వచ్ఛమైన వాతావరణంలో పెరిగే అవకాశం నాకు దక్కింది. కానీ ఇప్పటి పిల్లలకు అది కరవైంది. దెబ్బతిన్న పర్యావరణాన్ని సరిదిద్దడానికి ఇక దశాబ్దమే మిగిలిందని నిపుణులు అంటున్నారు. అందువల్ల విధాన రూపకర్తలు, తల్లిదండ్రులు కలిసికట్టుగా పనిచేసి పిల్లలకోసం ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించడానికి శ్రమించాలి’’ అని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.