ద్వేషపూరిత ప్రసంగాల విషయంలో కఠినంగా వ్యవహరించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ద్వేషపూరిత ప్రసంగాలు చేసే వారిపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఫిర్యాదు అందే వరకు వేచిచూడకుండా సుమోటోగా స్పందించాలని దిల్లీ, ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రభుత్వాలకు నిర్దేశించింది. మతంతో సంబంధం లేకుండా అలాంటి ప్రసంగాలు చేసే వారిపై చర్యలు తీసుకోవాలని సూచించింది. దేశంలో ద్వేషపూరిత వాతావరణం నెలకొందని అభిప్రాయపడింది సుప్రీంకోర్టు. కొన్ని అంశాల్లో ప్రజల దృష్టి మరల్చేందుకు ఇలాంటి ప్రసంగాలు చేస్తున్నారని వ్యాఖ్యానించింది. ఇలాంటి వాటిని సహించలేమని జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ హ్రిషికేశ్ రాయ్‌తో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.
'విద్వేష ప్రసంగాలు చేసేవారిపై తక్షణ చర్యలు.. ఫిర్యాదు అందకపోయినా..' - విద్వేష ప్రసంగాలపై సుప్రీంకోర్టు ఆదేశాలు
విద్వేష ప్రసంగాలు చేసేవారిపై తక్షణ చర్యలు తీసుకోవాలని మూడు రాష్ట్రాల ప్రభుత్వాల్ని కేంద్రప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. కొన్ని అంశాల్లో ప్రజల దృష్టి మరల్చేందుకు ఇలాంటి ప్రసంగాలు చేస్తున్నారని అభిప్రాయపడింది.
'విద్వేష ప్రసంగాలు చేసేవారిపై తక్షణ చర్యలు'
21వ శతాబ్దంలో ఏం జరుగుతోంది? మతం పేరుతో ఎక్కడికి చేరుకున్నాం? అని ప్రశ్నించింది సుప్రీంకోర్టు. భారత రాజ్యాంగం శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడం గురించి చెపుతోందని గుర్తు చేసింది. దేశంలో ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని భయభ్రాంతులకు గురిచేస్తున్న ముప్పును అరికట్టేందుకు తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌లపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.