సాధించాలనే పట్టుదల, నిబద్ధత ఉండాలే కానీ వయసుతో సంబంధం లేదని నిరూపిస్తున్నారు హరియాణా గురుగ్రామ్‌కు చెందిన 60 సంవత్సరాల బామ్మ. ఈ వయసులో కూడా తన 13 ఏళ్ల మనవరాలితో కలిసి దుబాయ్‌లో జరిగిన అంతర్జాతీయ కరాటే పోటీల్లో పాల్గొని పతకాలను గెలుచుకున్నారు.
హరియాణాలోని గురుగ్రామ్ సెక్టార్ 5లో నివాసముండే గీతా గోదారా అనే వృద్ధురాలి వయసు 60 సంవత్సరాలు. ఈమెకు తన 13 ఏళ్ల మనవరాలు ఆష్కా గోదారాను కారాటే ఛాంపియన్‌గా చూడాలని ఆశ పడేవారు. ఆ కలను సాకారం చేసుకోవడానికి తానె దగ్గరుండి మనవరాలికి కరాటేలో శిక్షణ ఇప్పించారు. ఈ సమయంలో ఆమె కూడా కరాటేలో మెళకువలు నేర్చుకున్నారు.
ఇప్పటికే హరియాణా నుంచి ఎందరో ఆటగాళ్లు అనేక జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొంటూ జాతీయ జెండాను రెపరెపలాడిస్తున్నారు. ఈ క్రమంలో మనవరాలితో కలిసి కరాటే పోటీల్లో పాల్గొన్నారు బామ్మ. వీరి ప్రతిభను చూసి ప్రతిఒక్కరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ప్రత్యర్థితో తలపడుతున్న బామ్మ గీతా గోదారా, మనవరాలు ఆష్కా గోదారా ఇద్దరూ ఛాంపియన్లుగా..
తన మనవరాలి కలను సాకారం చేసే క్రమంలోనే తాను కూడా కరాటేలో శిక్షణ పొందానంటున్నారు గీతా గోదారా. ఈమె ఏప్రిల్ 30న దుబాయ్‌లో నిర్విహించిన అంతర్జాతీయ కరాటే ఛాంపియన్‌షిప్‌లో ఆడేందుకు వెళ్లారు. ఉజ్బెకిస్థాన్ క్రీడాకారిణితో పోటీపడ్డ ఈ 60 ఏళ్ల బామ్మ రజత పతకం సాధించారు. కొంతకాలానికే మనవరాలు ఆష్కా కూడా ఈ పోటీల్లో ఆడి 1 రజతం, 1 కాంస్య పతకాలను గెలుచుకుంది. విదేశాల్లో ఉండే వారు సైతం వీరి గురించి తెలుసుకొని ప్రశంసలు కురిపిస్తున్నారు.
2 ఏళ్ల సాధన కల నెరవేర్చింది..
తన మనవరాలితో కలిసి ఏదో ఒక రోజు దేశానికి పతకం సాధిస్తానని బహుశా అప్పట్లో ఆమె కూడా అనుకొని ఉండరు. సరిగ్గా రెండు సంవత్సరాల క్రితం గీతా గోదారా తన మనవరాలికి కరాటేలో శిక్షణ ఇప్పించేందుకు అకాడమీకి తీసుకెళ్లి చేర్పించారు. క్రమంగా ఆష్కా గోదారా కరాటేలో నైపుణ్యం సాధించింది. కరాటేలో మనవరాలి ప్రతిభను చూస్తూ వచ్చిన గీతా గోదారా మెల్లగా తాను కూడా కరాటేలో మెళకువలు నేర్చుకోవడం ప్రారంభించారు. ఇలా రోజుకు రెండు గంటల పాటు సాధన చేసేవారు అమ్మమ్మ-మనవరాలు. రెండు సంవత్సరాల పాటు చేసిన ఈ కఠోర సాధనే ఈరోజు తమను పతక విజేతలుగా నిలబెట్టిదంటున్నారు గీతా గోదారా.
ప్రత్యర్థితో తలపడుతున్న 60 ఏళ్ల గీతా గోదారా 22 దేశాలు.. 2500 మంది..
భూటాన్, బంగ్లాదేశ్, పాకిస్థాన్, నేపాల్, ఇరాన్, జపాన్, ఇండోనేషియా, రష్యా, మలేషియా, శ్రీలంక సహా 22 దేశాల నుంచి 2500 మందికి పైగా క్రీడాకారులు దుబాయ్‌లో జరిగిన ఇంటర్నేషనల్ కరాటే పోటీల్లో పాల్గొనేందుకు వచ్చారు. ఇంతటీ గట్టి పోటీలో కూడా అమ్మమ్మ-మనవరాలు తమ ప్రతిభను కనబరిచి పతకాలను ముద్దాడారు. ఒక క్రీడాకారుడు ఎంతో నిబద్ధతతో కష్టపడితే సులువుగా గమ్యాన్ని చేరుకోవచ్చని నిరూపించారు గీతా గోదారా, ఆష్కా గోదారా.