Hamoon Cyclone Update : వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మంగళవారం ఉదయం తీవ్ర తుపానుగా మారిందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. దాదాపు 200 కిలోమీటర్ల దూరం నుంచి ఒడిశా రాష్ట్ర తీరం దాటుతుందని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 21 కిలోమీటర్ల వేగంతో తుపాను కదులుతుందని.. ఇది మరికొద్ది గంటల్లో తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని ఐఎండీ బులెటిన్‌లో పేర్కొంది.
ఆ తర్వాత, ఈశాన్య దిశగా తుపాను కదులుతున్నప్పుడు క్రమంగా అల్పపీడనం బలహీనపడి.. మంగళవారం సాయంత్రం ఖేపుపరా, చిట్టగాంగ్ మధ్య తీరం దాటే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. తుపాన్ తీరం దాటే సమయంలో గంటకు 65 నుంచి 75 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొన్నారు. ఈ క్రమంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని భారత వాతావరణ శాఖ సూచించింది. ఈ తుపానుకు 'హమూన్' అని పేరు పెట్టారు. ఈ పేరును ఇరాన్ సూచించింది. అయితే ఈ తుపాను భారత తీరంపై పెద్దగా ప్రభావం చూపకపోవచ్చని సోమవారం ఐఎండీ అంచనా వేసింది.
సోమవారం సాయంత్రం 5.30 గంటల సమయంలో ఒడిశాలోని పారాదీప్ తీరానికి 230 కిలోమీటర్లు, బంగాల్లోని ధిగాకు దక్షిణంగా 240 కిలోమీటర్ల దూరంలో, బంగ్లాదేశ్‌లోని ఖేపుపరాకు 280 కిలోమీటర్ల దూరంలో, నైరుతి దిశగా ఉన్న చిట్టగాంగ్‌కు 410 కి.మీల దూరంలో ఈ హమూన్ తుపాను కేంద్రీకృతమైందని IMD తెలిపింది. ఈ అల్పపీడనం గత కొద్ది గంటల్లో గంటకు 14 కిలోమీటర్ల వేగంతో ఉత్తర దిశగా కదిలి తుపానుగా మారిందని అధికారులు పేర్కొన్నారు.
కోస్తాంధ్రలో తేలికపాటి వర్షాలు..
రానున్న 12 గంటల్లో వాయువ్య బంగాళాఖాతంలో ఈ తుపాను మరింత బలపడి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని ఐఎండీ సోమవారం రాత్రి పేర్కొంది. అక్టోబర్ 25న బంగ్లాదేశ్‌లోని ఖేపుపరా, చిట్టగాంగ్ మధ్య బంగ్లా తీరం దాటే అవకాశం ఉందని.. అది తీవ్ర అల్పపీడనంగా మారుతుందని తెలిపింది. తుపాను ప్రభావంతో ఒడిశాలో గత కొద్ది గంటల్లో దాదాపు 15 కి.మీల వర్షపాతం నమోదైంది. దీంతో మంగళవారం కోస్తాంధ్రలో సైతం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.