భారత రాజ్యంగం.. దేశ గమనానికి మార్గసూచీ. ప్రజలు, ఇతరుల హక్కులకు భంగం కలిగించకుండా స్వేచ్ఛగా జీవించేందుకు భరోసా కల్పిస్తుంది. ఇంతటి విశిష్ఠ పుస్తకానికి సంబంధించిన కాపీలు మనం ఇంతకుముందు చూసే ఉంటాం. కానీ అసలైన ప్రతి(ఒరిజినల్ డాక్యుమెంట్)ని ఎప్పుడైనా చూశారా? దేశంలో వేరువేరు ప్రాంతాల్లో భద్రపరిచిన 16 కాపీల్లో మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ సెంట్రల్ లైబ్రరీలో ఉంది ఓ అసలు ప్రతి.
గ్వాలియర్‌లో గర్వకారణం..
1956 మార్చి 31 నుంచి రాజ్యంగం అసలు ప్రతిని గ్వాలియర్‌లో భద్రపరిచారు. అసలు ప్రతిని తమ రాష్ట్రంలో ఉండటాన్ని గర్వంగా భావిస్తున్నామంటున్నారు లైబ్రరీ మేనేజర్ వివేక్ సైనీ.
"1956 మార్చి 31 నుంచి ఈ ప్రతిని సెంట్రల్ లైబ్రరీలో భద్రపరుస్తున్నాం. ఐదారేళ్లుగా సామాన్య ప్రజలకు నవంబర్ 26, ఆగస్టు 15, జనవరి 26న ప్రదర్శనకు ఉంచుతున్నాం. దీనిని చూడటానికి చాలామంది వస్తుంటారు. అయితే ఈసారి.. కొవిడ్ కారణంగా ఎక్కువ మందికి అవకాశం లభించలేదు. చాలా మంది దీని గురించి ఆరాతీస్తూ ఉంటారు. వెయ్యేళ్లైన ఈ పుస్తకం భద్రంగా ఉంటుంది. అంత జాగ్రత్తగా పెట్టాం. బంగారపు పూతను పుస్తక తయారీలో వినియోగించారు. జవహర్లాల్ నెహ్రూ, అంబేడ్కర్ వంటి మహానేతల సంతకాలు ఇందులో ఉన్నాయి."
- వివేక్ సైనీ, లైబ్రరీ మేనేజర్
భద్ర పరిచే విధానం-ప్రత్యేకత
మన రాజ్యాంగ ప్రతి ముద్రించినది కాదు. స్వయంగా చేతితో రాసినది. భూమి మీద చేతితో రాసిన అతిపెద్ద రాజ్యంగం మనదే. దానిని ప్రేమ్ బిహారి నారాయణ్.. ఇటలీ శైలీలో అందంగా రాశారు. రాజ్యాంగాన్ని డెహ్రాడూన్‌లో ముద్రించారు. ప్రతి పేజీని శాంతినికేతన్‌కు చెందిన చిత్రకారులు రామ్మోహన్ సిన్హా, నందలాల్ బోస్ సుందరంగా రూపొందించారు.