తన తల్లి మతం మార్చుకోవడంపై (Religious Conversion in Karnataka) కర్ణాటక భాజపా ఎమ్మెల్యే గూలిహట్టి శేఖర్ (Gulihatti Shekar) ఆవేదన వ్యక్తం చేశారు. క్రైస్తవ మిషనరీలు అమాయకులను లక్ష్యంగా చేసుకొని మత మార్పిడి చేయించుకునేలా ప్రోత్సహిస్తున్నాయని (Christian Conversion) ఆరోపించారు. ఈ నేపథ్యంలో బలవంతపు మత మార్పిళ్లకు వ్యతిరేకంగా చట్టాన్ని తీసుకురావాలని కర్ణాటక అసెంబ్లీలో ప్రతిపాదన చేశారు.
"ఒక మతం నుంచి మరో మతానికి మారిపోవడం విస్తృతంగా జరిగిపోతోంది. నా నియోజకవర్గంలో 10-20 వేల మంది మతం మార్చుకున్నారు. నా తల్లి కూడా మతం మారిపోయింది. క్రైస్తవ మిషనరీలు అమాయకులను లక్ష్యంగా చేసుకొని బ్రెయిన్ వాష్ చేస్తున్నాయి. నా తల్లి విషయంలోనూ అదే జరిగింది. నా తల్లి మొబైల్ రింగ్టోన్ కూడా ఆ మతానికి సంబంధించినదే ఉంది. మా ఇంట్లో హిందూ దేవతలను పూజించడం లేదు. ఇది చాలా ఇబ్బందికరంగా అనిపిస్తోంది."
-గూలిహట్టి శేఖర్, ఎమ్మెల్యే
దళితులు, బీసీలు, ముస్లింలను మత మార్పిడి చేసుకునేలా ప్రోత్సహిస్తున్నారని క్రైస్తవ మిషనరీలను (Christian Conversion) ఉద్దేశించి ఆరోపించారు ఎమ్మెల్యే శేఖర్. మతం మారిన ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దీనికి సంబంధించి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు.
మరో ఎమ్మెల్యే బోపయ్య.. శేఖర్ ప్రతిపాదనకు మద్దతు పలికారు. యూపీ తరహా చట్టాన్ని అమలు చేయాలని కోరారు.