తెలంగాణ

telangana

ETV Bharat / bharat

తీరం దాటిన తౌక్టే- గుజరాత్, మహారాష్ట్రలో అల్లకల్లోలం - తౌక్టే తుపాను అప్​డేట్స్

దేశ పశ్చిమ తీరంపై విరుచుకుపడిన అతి తీవ్ర తుపాను తౌక్టే.. గుజరాత్‌లో తీరం దాటింది. ఈ సమయంలో కురిసిన భారీ వర్షాలు గుజరాత్‌, మహారాష్ట్రలో అపారనష్టం కలిగించాయి. తీర ప్రాంత పట్టణాలు, గ్రామాల్లో.. పెద్దఎత్తున చెట్లు, విద్యుత్‌ స్తంభాలు నేలకూలగా.. పలు ప్రాంతాల్లో అంధకారం నెలకొంది. తుపాను ధాటికి 14 మంది మరణించారు.

tauktae cyclone
తౌక్టే, గుజరాత్​

By

Published : May 18, 2021, 5:21 AM IST

Updated : May 18, 2021, 7:04 AM IST

దేశ పశ్చిమ తీరంపై విరుచుకుపడిన 'తౌక్టే' అతి తీవ్ర తుపాను.. బీభత్సం సృష్టించింది. మహారాష్ట్ర, గుజరాత్‌లతో పాటు గోవా తీర ప్రాంతాలపై పెను ప్రభావం చూపించింది. సోమవారం రాత్రి పొద్దుపోయాక ఇది గుజరాత్‌ వద్ద తీరాన్ని దాటిందని అధికారులు ప్రకటించారు. దీని ధాటికి అరేబియా సముద్రంలో రెండు నౌకలు (బార్జిలు) తమతమ లంగర్లను తెంచుకుని కొట్టుకుపోయాయి. తక్షణ సహాయక చర్యల ద్వారా వాటిలో ఉన్న 410 మందిని రక్షించగలిగారు. ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయంలో కొన్ని గంటల పాటు రాకపోకలు స్తంభించిపోయాయి.

నాసా తీసిన తౌక్టే ఉపగ్రహ చిత్రం

మహారాష్ట్రలోని కొంకణ్‌ ప్రాంతంలో వేర్వేరు ఘటనల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, రెండు పడవలు నీట మునిగి ముగ్గురు నావికులు గల్లంతయ్యారు. కర్ణాటకలో మొత్తం 8 మంది చనిపోయారు. తుపాను ప్రభావం, సహాయక చర్యల తీరుతెన్నులపై గుజరాత్‌, మహారాష్ట్ర, గోవా ముఖ్యమంత్రులతో, దమణ్‌ దీవ్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌తో ప్రధాని నరేంద్రమోదీ ఫోన్లో మాట్లాడారు. పౌర యంత్రాంగాలకు చేదోడువాదోడుగా ఉండాలని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ త్రివిధ దళాలను ఆదేశించారు. నౌకలు, గజ ఈతగాళ్లు, సహాయక సామగ్రిని ఎక్కడెక్కడ మోహరించాలో నిర్దేశించారు.

మంగళూరు తీరంలో చిక్కుకున్న ఓడలు

గంటకు 185 కి.మీ. వేగంతో ప్రచండ గాలులు

ఈ ఏడాదిలో తొలి తుపాను అయిన తౌక్టే.. గంటకు 185 కి.మీ. వేగంతో గాలులకు కారణమై తీర ప్రాంతాలను అతలాకుతలం చేసింది. ఒక్క గుజరాత్‌లోనే రెండు లక్షలమంది లోతట్టు ప్రాంత ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి వచ్చింది. ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ బలగాలను రంగంలో దించారు. ముంబయిలో కుంభవృష్టి కురిసింది. గంటకు 20 కి.మీ. చొప్పున కదులుతూ వచ్చిన తుపాను సౌరాష్ట్ర తీరంలో రాత్రి 9.30 గంటలకు భూమిని తాకడం మొదలైందని సోమవారం రాత్రి 11 గంటల సమయంలో భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అహ్మదాబాద్‌ కేంద్రం ప్రకటించింది. ఇది పూర్తిగా తీరాన్ని దాటడానికి 3 గంటల సమయం పట్టిందని తెలిపింది.

ముంబయిలో పెనుగాలులు, ధ్వంసమైన కారు

పోర్‌బందర్‌లోని ప్రభుత్వాసుపత్రి ఐసీయూలో వెంటిలేటర్‌పై ఉన్న 17 మంది కొవిడ్‌ బాధితుల్ని ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఇతర ఆసుపత్రులకు హుటాహుటిన తరలించారు. ఈ తుపాను ముంబయికి సమీపానికి వచ్చినప్పుడు గాలుల వేగం గంటకు 114 కి.మీ. ఉంది. దీంతో ఛత్రపతి శివాజీ మహారాజ్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో రాకపోకల్ని ఉదయం 11 నుంచి రాత్రి 10 గంటల వరకు నిలిపివేశారు. మొత్తం 55 సర్వీసులు రద్దయ్యాయి. మరికొన్నింటిని దారి మళ్లించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది. తుపాను ఉద్ధృతికి ముందే గుజరాత్‌ నుంచి రెండు ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు దిల్లీకి వెళ్లగలిగాయి. ముంబయిలో సబర్బన్‌ రైళ్ల రాకపోకల్ని నిలిపివేశారు.

గేట్​ వే ఆఫ్​ ఇండియా వద్ద

స్పందించిన కేంద్రం

తుపాను కోరల్లో చిక్కుకున్న గుజరాత్‌కు కావాల్సిన సాయం అందిస్తామని కేంద్రం ముందుకు వచ్చింది. అవసరమైతే రంగంలో దిగడానికి సంసిద్ధంగా ఉండాలని త్రివిధ దళాలకు ఆదేశాలు పంపింది. మహారాష్ట్ర, గుజరాత్‌, గోవా సీఎంలతో ప్రధాని మోదీ ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ముంబయి తీరంలో రెండు నౌకలు కొట్టుకుపోవడం వల్ల 410 మంది ప్రాణాలకు ప్రమాదం వాటిల్లబోతోందన్న సమాచారం అందుకున్నాక భారత నౌకాదళం మూడు యుద్ధ నౌకల్ని సహాయం కోసం పంపించింది. ఒక నౌక బాంబే హై ప్రాంతంలోని హీరా చమురు క్షేత్రం వద్ద కొట్టుకుపోగా.. దానిలో 273 మంది సిబ్బంది ఉన్నారు. మరో నౌకలో 137 మంది ఉన్నారు.

ఈ రెండూ ఓఎన్జీసీ రిగ్గుల వద్ద సేవలందిస్తున్నాయి. షాపోర్‌జీ పల్లోంజీ గ్రూపునకు చెందిన అఫ్కాన్స్‌ తరఫున సిబ్బంది వీటిలో పనిచేస్తున్నారు. లంగరు వేసి ఉంచినా పెనుగాలుల ధాటికి నౌకలు కొట్టుకుపోయాయి. రెండు నౌకల్లో ఉన్నవారికి ప్రాణాపాయం లేదని, అంతా సురక్షితంగా ఉన్నారని అఫ్కాన్స్‌ ప్రతినిధి ప్రకటించారు. కొచ్చి తీరానికి 35 నాటికల్‌ మైళ్ల దూరంలో ప్రమాదంలో చిక్కుకున్న 12 మంది మత్స్యకారులను భారత తీరగస్తీ దళం (ఇండియన్‌ కోస్ట్‌గార్డ్‌) రక్షించింది. తుపాను తీవ్రతకు గుజరాత్‌లో పెద్దఎత్తున చెట్లు నేలకూలాయి. భావ్‌నగర్‌ జిల్లాలో కొన్ని ప్రాంతాలకు ఆదివారం రాత్రి నుంచి విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. ఈ జిల్లాలోని ఘోఘా ఓడరేవులో 9వ నంబరు అతి ప్రమాద హెచ్చరిక జెండాను ఎగరవేశారు. అహ్మదాబాద్‌, సూరత్‌, రాజ్‌కోట్‌ విమానాశ్రయాల నుంచి విమానాల రాకపోకల్ని మంగళవారం సాయంత్రం వరకు రద్దు చేశారు. సూరత్‌లో రెండు మీటర్ల ఎత్తున సముద్ర కెరటాలు ఎగిసిపడ్డాయి.

ఇదీ చదవండి:అతితీవ్ర తుపానుగా తౌక్టే- 'మహా'లో విధ్వంసం

Last Updated : May 18, 2021, 7:04 AM IST

ABOUT THE AUTHOR

...view details