Gujarat Election 2022 : ఉచితాలకు తాము వ్యతిరేకమనే వాదనకు కమలనాథులు కట్టుబడతారా లేక ప్రత్యర్థులను ఎదుర్కొనేందుకు ఈసారికి తాము గీసుకున్న గీత దాటుతారా.. లేక తాయిలాలను మరిపించేలా ఏదైనా చేస్తారా అనేది ఆసక్తికరం! గుజరాత్ మేనిఫెస్టో విషయంలో భాజపా కాసింత కఠిన పరీక్షనే ఎదుర్కొంటోంది. తొలి విడత ఎన్నికలకు (డిసెంబరు 1) మరో వారం రోజులే ఉన్నా గెలిస్తే ఏం చేస్తామో చెప్పే సంకల్ప పత్రంపై పార్టీ కసరత్తు చేస్తూనే ఉంది. మరోవైపు ప్రత్యర్థి కాంగ్రెస్‌తో పాటు ప్రచారంలో ముందున్న ఆమ్ ఆద్మీ పార్టీ తమ మేనిఫెస్టోలను విడుదల చేశాయి. తాము గెలిస్తే ఏం చేస్తామో చెప్పేశాయి. రెండు పార్టీలు కూడా పోటీపడి లక్షల సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగాలు, ఉచిత విద్యుత్, నిరుద్యోగ భృతిలాంటి ఉచిత తాయిలాలు, పాత పింఛను పథకం అమలులాంటి హామీలు గుప్పించాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న దిల్లీ, పంజాబ్‌ల్లో తాము అనుసరిస్తున్న విద్య, ఆరోగ్య పథకాలను కేజ్రీవాల్ సారథ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ బలంగా రచారం చేసుకుంటోంది. మరి వీటికి పోటీగా భాజపా ఏం చెబుతుందని అంతా ఎదురుచూస్తున్నారు.
ఉచితాలపై ఆప్, కాంగ్రెస్ దూకుడు.. భాజపాకు సంకటం.. వైఖరి మార్చుకుంటారా? - ఉచిత హామీలు ఇస్తున్న ఆప్
Gujarat Election 2022 : ఎన్నికలు దగ్గరపడ్డా గుజరాత్‌లో అధికార భారతీయ జనతా పార్టీ ఇంకా మేనిఫెస్టో విడుదల చేయలేదు. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటికే అనేక ఉచితాలు, హామీలు గుప్పించడం వల్ల భాజపా ఆలోచనలో పడింది. ఉచితాలను విమర్శిస్తున్నా.. వాటికి పూర్తిగా భాజపా దూరంగా ఉండగలుగుతుందా అనేది చర్చనీయాంశంగా మారింది.
అగ్రేసర్ గుజరాత్ పేరుతో..
గత ఎన్నికల్లో సీట్లు తగ్గిన అనుభవానికి తోడు.. ఈసారి రాష్ట్రంలో బలమైన ముద్ర వేసేందుకు ఆమ్ ఆద్మీపార్టీ చూపుతున్న దూకుడు నేపథ్యంలో భాజపా ఆచితూచి వ్యవహరిస్తోంది. వీటికి తోడు ఎన్నికలకు ముందు ప్రజలకు పార్టీలు ఉచిత తాయిలాలు ప్రకటించటాన్ని ప్రధాని నరేంద్రమోదీ విమర్శించారు. ఇలాంటి హామీల పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. ఇవన్నీ కూడా మేనిఫెస్టో విడుదల విషయంలో భాజపాను కట్టడి చేస్తున్నాయి. అందుకే ఎప్పటిలా హామీలతో మేనిఫెస్టోను వెల్లడించకుండా భాజపా ఈసారి 'అగ్రేసర్ గుజరాత్' అంటూ కొత్త దారి పట్టింది. రాష్ట్రాన్ని మెరుగు పర్చటానికి, అగ్రస్థానంలో ఉంచటానికి ఏం చేయాలో చెప్పాలంటూ ప్రజల నుంచే సూచనలు తీసుకొనే కార్యక్రమమే ఈ అగ్రేసర్ గుజరాత్! రాష్ట్రంలోని అన్ని పట్టణాలు, పల్లెల్లో ఇందుకోసం ప్రత్యేకంగా పెట్టెలు పెట్టారు. మెయిల్ ద్వారా కూడా సూచనల్ని ఆహ్వానించారు. ఈనెల 15 దాకా ఈ కార్యక్రమం కొనసాగింది.
కింకర్తవ్యం..?
ఉచితాలను విమర్శిస్తున్నా.. వాటికి పూర్తిగా భాజపా దూరంగా ఉండగలుగుతుందా అనేది చూడాల్సిన అంశం. ఎందుకంటే... ఆమ్ ఆద్మీపార్టీ, కాంగ్రెస్ ఇచ్చినవి కీలకమైన హామీలు. ముఖ్యంగా 300 యూనిట్ల దాకా ఉచిత విద్యుత్ అనేది మధ్యతరగతిని బాగా ఆకట్టుకుంటోంది. వాటిని తలదన్నేలా భాజపా ఏం చెబుతుందన్నది ఆసక్తికరం. ఇటీవల గుజరాత్ ప్రచార సభల్లో ప్రధాని నరేంద్రమోదీ 'ఉచిత విద్యుత్ కష్టమైనప్పటికీ ఇవ్వటానికి ప్రయత్నిస్తాం' అన్నట్లుగా వార్తలొచ్చాయి. రెండు గ్యాస్ సిలిండర్లు ఉచితం; ఉమ్మడి పౌర చట్టంలాంటి హామీలైతే భాజపా మేనిఫెస్టోలో కచ్చితంగా ఉంటాయనుకుంటున్నారు.