గోద్రా మున్సిపాలిటీలో భాజపా అధికారంలోకి రాకుండా మజ్లిస్ పార్టీ అడ్డుపడింది. స్వతంత్రులకు.. తమ పార్టీ నుంచి గెలిచిన ఏడుగురు సభ్యుల మద్దతు ఉంటుందని ప్రకటించింది. దీంతో 2002 నుంచి ఇక్కడ అధికారంలో ఉన్న భాజపా.. పీఠానికి దూరమైంది.
గోద్రా మున్సిపాలిటీలో 44 స్థానాలు ఉన్నాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో 18 స్థానాలను భాజపా గెలుచుకుంది. తొలిసారి బరిలోకి దిగిన ఎంఐఎం ఏడు చోట్ల విజయం సాధించింది. 17 మంది స్వతంత్రులు గెలుపొందారు. స్వతంత్రుల బృందానికి మద్దతు ప్రకటించడం వల్ల పీఠం చేజిక్కించుకునేందుకు భాజపాకు దారులు మూసుకుపోయాయి.
'భాజపాను అడ్డుకున్నాం'
తమ మద్దతుతో స్వతంత్రులకు అధికారం చేపట్టేందుకు కావాల్సిన ఆధిక్యం లభించిందని ఎంఐఎం గుజరాత్ చీఫ్ సాబిర్ కబ్లివాలా తెలిపారు. స్వతంత్ర అభ్యర్థులు సంజయ్ సోనీని అధ్యక్షుడిగా, అక్రమ్ పటేల్‌ను ఉపాధ్యక్షుడిగా ఎన్నుకున్నట్లు తెలిపారు.