దేశ జనాభాలో ఇప్పటివరకు 1.8 శాతం మంది మాత్రమే కరోనా బారినపడ్డారని.. అంటే మిగతా 98 శాతం ప్రజలకు కరోనా సోకే అవకాశాలు లేకపోలేదని కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. అయితే కరోనా పునరుత్పాదక సామర్థ్యం(ఆర్) విలువ ఒకటికి పడిపోవడం సంతోషించవలసిన విషయం అని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ అన్నారు. దీనిని బట్టి.. కరోనా మహమ్మారి క్రమంగా తగ్గుతున్నట్లేనని పేర్కొన్నారు. చాలా రాష్ట్రాల్లో కరోనా కేసులు తక్కువగా నమోదవుతున్నాయని అన్నారు. కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గుముఖం పట్టడానికి ఆస్పత్రులు, ఇళ్లల్లో ప్రజలు తీసుకున్న జాగ్రత్తలేనని తెలిపారు.
"కరోనా మృతుల సంఖ్య కూడా నియంత్రణలోనే ఉంది. వ్యాధిని కట్టడి చేయడానికి తీసుకున్న జాగ్రత్తలతోనే కేసులు తగ్గుతున్నాయి. మళ్ళీ కరోనా విజృంభించే అవకాశం ఇవ్వకూడదు."
-వీకే పాల్, నీతి ఆయోగ్ సభ్యుడు
"బ్లాక్ ఫంగస్ గురించి కూడా రాష్ట్రప్రభుత్వాలతో చర్చించాం. అయితే కేసులు పెద్దగా నమోదు కావట్లేదు. అలా అని నిర్లక్ష్యంగా ఉండకూడదు. బ్లాక్ ఫంగస్‌ను నయం చేసే అంపోటెరిసిన్ బీ అందుబాటులో ఉంచాలి. అయితే బ్లాక్ ఫంగస్ కేసులు చాలావరకు కొవిడ్ వచ్చిన సమయంలో ఎక్కువగా స్టెరాయిడ్స్ తీసుకునే వారిలో వస్తుందని గమనించాం, అందులోనూ డయాబెటిస్.. ఉన్నవారికే ప్రమాదం పొంచి ఉంది. కాబట్టి డయాబెటిస్ స్థాయుల్ని నియంత్రణలో ఉంచుకోవడం ముఖ్యం. అంతేకాకుండా స్టెరాయిడ్స్‌ను ఇష్టం వచ్చినట్లుగా వాడకూడదు." అని అన్నారు.
"పిల్లల్లో కరోనా లక్షణాలు అంతగా కనిపించినప్పటికీ వారు కరోనాను వ్యాప్తి చేయగలరు. దానిపై మాకు స్పష్టత ఉంది. ఒక వేళ పిల్లల్లో కరోనా లక్షణాలు ఉంటే.. తగిన జాగ్రత్తలు పాటించాల్సిందే"నని తెలిపారు పాల్.
ఇదీ చదవండి:'ఆ స్ట్రెయిన్‌తో పిల్లలకు ముప్పు- విమానాలు ఆపండి'