social media rules 2021: సోషల్ మీడియాను కట్టడి చేసేందుకు కేంద్రం మరిన్ని కఠిన నిబంధనలను ప్రవేశపెట్టనుంది. సామాజిక మాధ్యమ సంస్థల గ్రీవెన్స్ అధికారులు తీసుకున్న నిర్ణయాలపై ఫిర్యాదుల పరిష్కారానికి అప్పీలేట్ కమిటీని నియమించనుంది. దీనికోసం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్ 2021ను సవరించనుంది. ఈ అప్పీలేట్ కమిటీలో ఛైర్‌పర్సన్‌తో పాటు సభ్యులు ఉంటారు. సోషల్ మీడియా సంస్థల గ్రీవెన్స్ అధికారి నిర్ణయంపై 30 రోజుల్లోగా అప్పీలేట్ కమిటీకి ఫిర్యాదు చేయాలి. ఫిర్యాదు అందిన 30రోజుల్లోగా దానికి కమిటీ పరిష్కారం చూపనుంది. కమ్యూనిటీ మార్గదర్శాకాలను ఉల్లఘించినందుకు సెలెబ్రిటీల ఖాతాలను బ్లాక్ చేసిన నేపథ్యంలో ఈ చర్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
ప్రముఖ సోషల్ మీడియా సంస్థ వాట్సాప్ ఏప్రిల్‌లో నివేదికను విడుదల చేసింది. సుమారు 16 లక్షల భారతీయ ఖాతాలను నిబంధనలకు అతిక్రమించినందుకు మూసివేసినట్లు తెలిపింది. మరోవైపు విద్వేషపూరిత ప్రసంగాలు 37.82 శాతం పెరిగాయని సోషల్ మీడియా సంస్థ ఫేస్బుక్ పేర్కొంది. ఇన్‌స్టాగ్రామ్‌లో 86 శాతం పెరిగిందని మాతృసంస్థ మెటా తన నివేదికలో తెలిపింది.