పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు రంగం సిద్ధమైంది. సోమవారం ప్రారంభం కానున్న ఈ సమావేశాలు.. వాడీవేడీగా జరిగే అవకాశం ఉంది. కరోనా కారణంగా గత రెండు సమావేశాల్లో ఉభయ సభలు వేర్వేరు సమయాల్లో భేటీ కాగా.. ఈసారి ఒకే సమయానికి రెండు సభలు కార్యకలాపాలు సాగించనున్నాయి. ఎప్పటిలానే ఈసారీ ఉదయం 11 గంటలకు సభలు మొదలు కానున్నాయి.
సమావేశాల నేపథ్యంలో అధికార, విపక్షాలు అస్త్రశస్త్రాలతో సన్నద్ధమవుతున్నాయి. కీలక బిల్లులు ఆమోదించుకోవాలన్న లక్ష్యంతో అధికార పక్షం బరిలోకి దిగుతోంది. చట్టాలకు సంబంధించి భారీ అజెండా రూపొందించుకుంది. 17 కొత్త బిల్లులను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది.
విపక్షాలు సంసిద్ధం
మరోవైపు, ప్రధాన సమస్యలపై సర్కారును ఇరుకున పెట్టాలని విపక్ష పార్టీలు వ్యుహాలు రచించుకుంటున్నాయి. దేశంలో నిత్యావసర, ఇంధన ధరలు మిన్నంటడంపై విపక్ష సభ్యులు భగ్గుమనే అవకాశం ఉంది. వీటితో పాటు సాగు చట్టాల రద్దు, కరోనా నియంత్రణ, టీకా పంపిణీ, రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు వివాదం, చైనాతో సరిహద్దు సంక్షోభం, దేశ ఆర్థిక పరిస్థితులు వంటి అంశాలు ప్రస్తావనకు రానున్నట్లు తెలుస్తోంది. వీటిపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని కాంగ్రెస్ ఇప్పటికే ప్రకటించింది.
కరోనాను ఎదుర్కోవడం, ధరల పెరుగుదలపై చర్చకు ప్రభుత్వం సమ్మతించే అవకాశం ఉందని తెలుస్తోంది. వీటిని ప్రస్తావించాలని ప్రతిపక్షాలు గట్టిగా పట్టుబడుతున్న వేళ.. ప్రభుత్వం కూడా ఇందుకు సిద్ధమవుతోంది.
చట్టాల అజెండా
కొత్తగా 17 బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఇప్పటికే ఆర్డినెన్స్ రూపంలో అమలవుతున్న బిల్లులు సైతం పార్లమెంట్ ముందుకు రానున్నాయి. ఇవి కాకుండా లోక్సభలో నాలుగు, రాజ్యసభలో మూడు బిల్లులు పెండింగ్లో ఉన్నాయి.
కేంద్రం ప్రవేశపెట్టనున్నకీలక బిల్లులివే
- ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్ట్సీ బిల్లు
- స్పెషల్ డిఫెన్స్ సర్వీసెస్ బిల్లు
- జాతీయ ఆహార టెక్నాలజీ సంస్థ బిల్లు
- దేశ రాజధాని ప్రాంత గాలి నాణ్యత యాజమాన్యంపై ఆర్డినెన్స్ స్థానంలో బిల్లు
- విద్యుత్ చట్ట సవరణ బిల్లు
- గిరిజన సంస్కరణల బిల్లు
- డీఎన్ఏ టెక్నాలజీ బిల్లు
- ఫ్యాక్టరింగ్ రెగ్యులేషన్ బిల్లు
- అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ బిల్లు
- తల్లిదండ్రులు-వృద్ధుల సంక్షేమం బిల్లు
- జనాభా నియంత్రణ, ఉమ్మడి పౌరస్మృతి