డిజిటల్ చెల్లింపులకు సురక్షితమైన భద్రత వాతావరణాన్ని కల్పించేందుకు, సైబర్ మోసాలను సమర్థంగా అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం వివిధ చర్యలను చేపట్టింది. అందులో భాగంగానే సైబర్ మోసాలకు గురైన బాధితులకు తక్షణమే సహాయం అందించేందుకు, వారి నుంచి ఫిర్యాదులను నేరుగా అందుకునేందుకు కేంద్ర హోంశాఖ 155260 నంబరుతో హెల్ప్‌లైన్‌ను అందుబాటులోకి తెచ్చింది. బాధితులు తమకు ఎదురైన సమస్యను నివేదించేందుకు ఓ వేదికనూ సమకూర్చింది. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్(ఐ4సీ) ఈ వేదికను నిర్వహించనుంది.
రిజర్వు బ్యాంకుతో పాటు అన్ని ప్రధాన బ్యాంకులు, పేమెంట్ బ్యాంకులు, వాలెట్స్, ఆన్‌లైన్ మర్చంట్స్ సహకారంతో హెల్ప్‌లైన్ నడుస్తుంది. ఏప్రిల్ నుంచి హెల్ప్‌లైన్‌ను ఛత్తీస్‌గఢ్, దిల్లీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, ఉత్తరాఖండ్, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాలు ఉపయోగించుకుంటున్నాయి. దీనిని ఇప్పుడు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ అందుబాటులోకి తెచ్చి మోసగాళ్ల బారి నుంచి అమాయకులను కాపాడటానికి చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర హోంశాఖ తెలిపింది.
ఫిర్యాదులపై తక్షణ స్పందన ఇలా..
- సైబర్ మోసగాళ్ల బాధితులు ఎవరైనా జాతీయ హెల్ప్‌లైన్ 155260కు ఫోన్‌చేస్తే అది సంబంధిత రాష్ట్ర పోలీసులకు వెళ్తుంది.
- ఫోన్ చేసిన వ్యక్తి ప్రాథమిక సమాచారాన్ని, మోసం జరిగిన వివరాన్ని పోలీస్ ఆపరేటర్ తెలుసుకొని సిటిజెన్ ఫైనాన్షియల్ సైబర్‌ఫ్రాడ్ రిపోర్టింగ్, మేనేజ్‌మెంట్ సిస్టమ్‌లో టికెట్ రూపంలో నమోదు చేస్తారు.
- ఆ టికెట్ వివరాలు వెంటనే సంబంధిత బ్యాంకులు, వ్యాలెట్స్, మర్చంట్స్‌కు వెళ్తాయి.
- ఫిర్యాదు అందినట్లు బాధిత వ్యక్తికి ఎస్‌ఎంఎస్ రూపంలో ధ్రువీకరణ వెళ్తుంది. ఆ నంబరు ఆధారంగా మోసానికి సంబంధించిన పూర్తి వివరాలు 24 గంటల్లో నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌లో నమోదు అవుతాయి.
- ఆ పోర్టల్‌లోని వివరాల ఆధారంగా సంబంధిత బ్యాంకు ఆ ఫిర్యాదు (టికెట్)ను అంతర్గత వ్యవస్థ ద్వారా తనిఖీ చేస్తుంది.
- బాధితుని డబ్బు ఇంకా ఆ బ్యాంకు పరిధిలోనే ఉంటే మోసగాళ్లకు బదిలీ కాకుండా నిరోధిస్తుంది. ఒకవేళ అప్పటికే ఆ డబ్బు మరో బ్యాంకుకు తరలించి ఉంటే ఫిర్యాదు వివరాలు తక్షణం అక్కడకు వెళ్తాయి. ఆ డబ్బు ఎన్ని బ్యాంకులకు వెళ్లినా వాటన్నిటినీ అప్రమత్తం చేసి మోసగాళ్ల చేతుల్లో పడకుండా అడ్డుకొనే ప్రయత్నం చేస్తుంది.
- ప్రస్తుతం ఈ హెల్ప్‌లైన్, రిపోర్టింగ్ వేదిక పరిధిలోకి అన్ని ప్రధానమైన ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు, పేటీఎం, ఫోన్‌పే, మొబిక్విక్, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి వ్యాలెట్స్, మర్చంట్లను కూడా చేర్చారు.
ఇదీ చూడండి:PM Modi: 'క్రాష్ కోర్సు'కు నేడు మోదీ శ్రీకారం