బాలల న్యాయ (చిన్నారుల భద్రత, సంరక్షణ) చట్టం-2015 సవరణ కోసం లోక్సభలో సోమవారం బిల్లు ప్రవేశపెట్టారు. ఈ చట్టం అమలులో జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్ల పాత్ర పెంచే ఉద్దేశంతో సవరణ బిల్లు తీసుకొచ్చారు.
కలెక్టర్లదే బాధ్యత..
కొత్త బిల్లు ప్రకారం... ఈ చట్టం అమలు చేసే సంస్థల విధులను పర్యవేక్షించే అధికారం జిల్లా పాలనాధికారి, అదనపు పాలనాధికారికి లభిస్తుంది. జిల్లా బాలల సంరక్షణా కేంద్రాలు కూడా వారి ఆధీనంలో పనిచేస్తాయి. దత్తత సహా పిల్లలకు సంబంధించిన సమస్యల పరిష్కారంలో పాలనా యంత్రాంగం సమన్వయం పెంచే దిశగా ఈ బిల్లును రూపొందించారు.
దీంతో పాటే గనులు, ఖనిజాలు (అభివృద్ధి నియంత్రణ), సముద్ర ప్రయాణాలు ప్రోత్సాహించడానికి నౌకాయన బిల్లు సహా మరో రెండు బిల్లులను లోక్సభలో ప్రవేశపెట్టారు.
రాజ్యసభలో..
దేశంలోని రెండు ఆహార సాంకేతిక సంస్థలను జాతీయ సంస్థలుగా గుర్తిస్తూ తీసుకొచ్చిన బిల్లును రాజ్యసభ సోమవారం మూజువాణి ఓటు ద్వారా ఆమోదించింది. హరియాణాలోని కుండ్లీలో, తమిళనాడులోని తంజావూరులో ఉన్న జాతీయ ఆహార సాంకేతికత, వ్యవస్థాపకత, నిర్వహణ సంస్థలకు జాతీయ సంస్థల హోదా కల్పించారు. వీటిల్లో రిజర్వేషన్ అమలు చేస్తామని కేంద్రమంత్రి నరేంద్ర సింగ్ తోమర్ స్పష్టంచేశారు.
ఇదీ చూడండి:'యూకేలో జాతివివక్షపై తగిన చర్యలు'