నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ పోరుబాట పట్టిన రైతు సంఘాలు, కేంద్రం మధ్య సుదీర్ఘంగా సాగిన నాల్గోవిడత చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. ఎల్లుండి మరోసారి సమావేశం కావాలని నిర్ణయించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సుమారు ఎనిమిది గంటల పాటు సాగిన చర్చలు ఎలాంటి ఫలితం లేకుండానే ముగిశాయి. ఈ నెల ఒకటో తేదీన జరిపిన చర్చల్లో.. చట్టాలపై అభ్యంతరాల అధ్యయనానికి కమిటీ ఏర్పాటు చేస్తామన్న కేంద్రమంత్రుల ప్రతిపాదనకు రైతు ప్రతినిధులు నిరాకరించారు. ఈ నేపథ్యంలో గురువారం మధ్యాహ్నం మరోసారి రైతు సంఘాలతో కేంద్రం చర్చలు జరిపింది. ఈ చర్చల్లో కేంద్ర మంత్రులు నరేంద్రసింగ్ తోమర్, పీయూష్ గోయల్, సోం ప్రకాశ్ పాల్గొన్నారు.
పార్లమెంటు ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేసి, నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని చర్చల సందర్భంగా రైతు సంఘాల ప్రతినిధులు కోరినట్లు తెలుస్తోంది. అయితే కనీస మద్దతు ధరను ఎట్టి పరిస్థితుల్లో ముట్టుకోమని, దానికి ఎలాంటి మార్పులు చేయబోమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి తోమర్ హామీ ఇచ్చినట్లు సమాచారం. రైతుల డిమాండ్లపై నిర్ణయం తీసుకునేందుకు ఎల్లుండి వరకూ సమయం కావాలని కేంద్ర మంత్రులు కోరినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి.
"ఎంఎస్పీపై అనేక అనుమానాలు ఉన్నాయి. ఎంఎస్పీ ఎప్పటికీ కొనసాగుతుంది. ఎల్లుండి మధ్యాహ్నం 2 గంటలకు మరోసారి రైతు సంఘాలతో ప్రభుత్వం చర్చలు జరుపుతుంది. అందులో తుది నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. ఇవాళ్టి చర్చలు మంచి వాతావరణంలో జరిగాయి. రైతులు తమ డిమాండ్లను సరిగ్గా తమ ముందు ఉంచారు. ప్రభుత్వానికి ఎలాంటి ఇగో లేదు. ప్రభుత్వం పూర్తి సంయమనంతో వారి డిమాండ్లను ఆలకించింది. ఆయా అంశాలపై ఇరువురం దాదాపు ఓ అంగీకారానికి వచ్చాం. చలికాలం అయినందున ఆందోళన విరమించాలని రైతులను కోరుతున్నా. ఇది వారికీ మంచిది, ఆందోళనల కారణంగా ఇబ్బందిపడుతున్న దిల్లీవాసులకూ మంచిది."
-నరేంద్ర సింగ్ తోమర్, వ్యవసాయ శాఖ మంత్రి