Asaduddin Owaisi News: ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి జెడ్ కేటగిరీ(సీఆర్పీఎఫ్) భద్రత కల్పించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు అధికార వర్గాలు తెలిపాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారం ముగించుకొని దిల్లీకి తిరిగివస్తుండగా.. ఆయన కారుపై గురువారం రోజు కాల్పులు జరిపారు దుండగులు. ఈ నేపథ్యంలోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Z Category to Asaduddin: సీఆర్పీఎఫ్ కమాండోలు 24 గంటలు ఒవైసీ భద్రతను పర్యవేక్షించనున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు.
గురువారం రోజు హాపుర్- గాజియాబాద్ జాతీయ రహదారిపై ఛాజర్సీ టోల్‌ప్లాజా వద్ద జరిగిన ఈ దాడిలో ఎవరికీ గాయాలు కాలేదు. అయితే.. ఈ ఘటనపై స్వతంత్ర దర్యాప్తు చేపట్టాలని ఎన్నికల సంఘాన్ని కోరారు అసదుద్దీన్.
ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకు ఇద్దరిని అరెస్టు చేసినట్లు హాపుర్ ఎస్పీ దీపక్ భుకర్ తెలిపారు. నిందితులను సచిన్, శుభంగా గుర్తించారు. ఒవైసీ హిందూ- వ్యతిరేక ప్రకటనలు, వ్యాఖ్యలు.. తమ మనోభావాలను దెబ్బతీశాయని, అందుకే కాల్పులు జరిపినట్లు ప్రాథమిక విచారణలో ఒప్పుకున్నారు. నిందితుల వద్ద పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. మొత్తం ఐదు బృందాలు.. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తున్నాయని ఏడీజీ ప్రశాంత్ కుమార్ తెలిపారు.
ఒవైసీపై నిందితులు కాల్పులు జరిపిన దృశ్యాలు.. సీసీటీవీలో నమోదయ్యాయి. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.
ఇదీ జరిగింది..
"యూపీ మేరఠ్‌లోని కిథౌర్‌లో ఎన్నికల ప్రచారం ముగించుకుని దిల్లీ బయలుదేరాను. ఛాజర్సీ టోల్గేట్ వద్ద నా వాహనంపై ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపారు. 3-4 రౌండ్లు తూటాలు దూసుకెళ్లాయి. నా వాహనం టైర్లు పంక్చర్ అయ్యాయి. నేను వేరే వాహనంలో వెళ్లిపోయాను. దాడి చేసేందుకు వచ్చిన వారు మొత్తం ముగ్గురు-నలుగురు ఉన్నారు." అని ఏఎన్ఐ వార్తా సంస్థతో గురువారం చెప్పారు అసదుద్దీన్.
ఇదీ చూడండి:అసదుద్దీన్ ఒవైసీ కారుపై దాడి- తుపాకులతో దుండగుల బీభత్సం!