Government Doctors Negligence : వైద్యుల నిర్లక్ష్యం ఓ వ్యక్తి ప్రాణాల మీదకు తెచ్చింది. తలకు గాయమైన ఓ వ్యక్తికి చికిత్స చేసి.. కుట్లు వేసే సమయంలో ఓ ఇనుప నట్టును అక్కడే వదిలేశారు. దీంతో బాధితుడికి రక్తస్రావం ఆగలేదు. వెంటనే అతడి కుటుంబ సభ్యులు ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ స్కాన్ చేయగా తలపై కుట్లు వేసిన ప్రదేశంలో ఇనుప నట్టును చూసి వైద్యులు షాక్‌కు గురయ్యారు. ఈ ఘటన తమిళనాడులో జరిగింది.
ఇదీ జరిగింది..
Iron Nut In Patient Head : తిరుపత్తూరు జిల్లా వానియాంబాడీ ప్రాంతంలోని ఉదయేంద్రం గ్రామానికి చెందిన కార్తికేయన్.. లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. సోమవారం ఉదయం 5 గంటల సమయంలో మాదనూరు సమీపంలో కార్తికేయన్ నడుపుతున్న లారీని, వెనుక నుంచి వచ్చిన ప్రైవేట్ బస్సు ఢీకొట్టింది. ఆ తర్వాత లారీ అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న గుంతలో బోల్తా పడింది. తలకు బలమైన గాయాలైన కార్తికేయన్‌ను స్థానికులు రక్షించి.. వేలూరులోని ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు. బాధితుడికి చికిత్స చేసి.. తలకు కుట్లు వేశారు అక్కడి వైద్యులు. అయినా రక్తస్రావం ఆగకపోవడం వల్ల కార్తికేయన్‌ను ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు అతడి కుటుంబ సభ్యులు. అక్కడ స్కాన్ చేసిన వైద్యులు.. బాధితుడి తలకు కుట్లు వేసిన ప్రదేశంలో ఇనుప నట్టు ఉన్నట్లు గుర్తించారు. అనంతరం ఆ నట్టును తీసేశారు. అయితే, గాయమైన ప్రదేశంలో ఇన్ఫెక్షన్ అయిందని.. రెండు రోజుల తర్వాత మళ్లీ కుట్లు వేస్తామని వైద్యులు తెలిపారు.