ఉత్తరాఖండ్‌లో మంచుచరియలు విరిగిపడి భారీ ప్రమాదం సంభవించింది. చమోలీ జిల్లాలో ధౌలీగంగా నదిని ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. పర్వత ప్రాంతాల్లోని మంచుచరియలు విరిగిపడడంతో ఒక్కసారిగా నీటి మట్టం పెరిగిపోయింది. రైనీ గ్రామం తపోవన్ వద్ద ఉన్న పవర్ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరింది. నీటి ప్రవాహం ధాటికి ఆనకట్ట కొట్టుకుపోయింది. ఒక్కసారిగా నీరు చేరడంతో రుషిగంగా పవర్ ప్రాజెక్టు దెబ్బతింది. ఈ విద్యుత్ కేంద్రంలో పనిచేస్తోన్న 150 మంది వరకు కార్మికులు ప్రమాదంలో మృతి చెందినట్లు ఆన్సైట్ ఇంఛార్జ్ అభిప్రాయపడుతున్నట్లు ఐటీబీపీ ప్రతినిధి తెలిపారు. ఇప్పటివరకు మూడు మృతదేహాలు లభ్యమైనట్లు ఉత్తరాఖండ్ డీజీపీ తెలిపారు. నదీ తీరంలో ఉన్న కొన్ని గ్రామాలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు సమాచారం.
దీంతో ఉత్తరాఖండ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. నది పరీవాహక ప్రాంతాల్లోని గ్రామాల ప్రజలు వెంటనే ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని చమోలీ జిల్లా కలెక్టర్ హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు సహాయక చర్యల కోసం ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. ఇండో-టిబెటన్ సరిహద్దు దళం పోలీసులు కూడా సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. లోతట్టు ప్రాంతాల వారిని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా భగీరథీ నది ప్రవాహాన్ని నిలివేశారు. అలకనంద నది ప్రవాహాన్ని నిలువరించేందుకు శ్రీనగర్, రిషిగంగా ఆనకట్టలను ఖాళీ చేయించారు. అటు. విష్ణుప్రయాగ్, జోషిమఠ్, కర్ణప్రయాగ్, రుద్రప్రయాగ్ ప్రాంతాల ప్రజలు నది తీరానికి వెళ్లవద్దని అధికారులు సూచించారు.