Ghulam Nabi Azad Congress: కాంగ్రెస్ నుంచి బయటకొచ్చి సొంత పార్టీ స్థాపించిన జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ నాయకులు గులాం నబీ ఆజాద్ మళ్లీ యూటర్న్ తీసుకోనున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. హస్తం పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర.. వచ్చే నెలలో జమ్ముకశ్మీర్‌కు చేరనుంది. ఈ నేపథ్యంలో ఆజాద్.. జోడో యాత్రలో పాల్గొని కాంగ్రెస్‌లో చేరుతారని పలు కథనాలు వచ్చాయి. సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్.. ఆజాద్‌ను యాత్రలో భాగం కావాలని ఆహ్వానించినట్లు సమాచారం.
అయితే వీటన్నింటిని ఆజాద్ కొట్టిపారేశారు. తాను కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి వెళ్లట్లేదని స్పష్టం చేశారు. "నేను ఏ కాంగ్రెస్ నాయకుడితో మాట్లాడలేదు.. నన్ను ఎవరూ పిలవలేదు. మీడియాలో ఇలాంటి కథనాలు ఎందుకు వచ్చాయో తెలియదు. వాటిని చూస్తే ఆశ్చర్యమేసింది. నా పార్టీ క్యాడర్‌లో అనిశ్చితి సృష్టించి.. వారిని నిరుత్సాహపరిచేందుకే కాంగ్రెస్ నేతలు ఈ ప్రయత్నాలు చేశారు" అని తెలిపారు. వచ్చే నెలలో జమ్ముకశ్మీర్‌లో జరిగే భారత్ జోడోయాత్రలో పాల్గొంటారా? అన్న ప్రశ్నకు.. అందుకు ఎలాంటి ప్రణాళిక లేదని, తనకు చాలా పనులు ఉన్నాయని బదులిచ్చారు.