Student Killed by Friend: ఉత్తర్‌ప్రదేశ్ గాజియాబాద్‌లోని ఒక పాఠశాలలో ఘోర సంఘటన జరిగింది. పదో తరగతి చదువుతున్న విద్యార్థి అదే పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న నీరజ్ కుమార్ (13) అనే విద్యార్థి గొంతు కోసి హత్య చేశాడు. అనంతరం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. తనను జైలుకు పంపాలని అభ్యర్థించాడు. బాలుడి ప్రవర్తనతో ఆశ్చర్యపోయిన పోలీసులు తొలుత నమ్మలేదు. అయితే అతడు చెప్పిన స్థలంలో నీరజ్ మృతదేహం కనిపించడంతో వారంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. దిల్లీ-మేరఠ్ ఎక్స్‌ప్రెస్ రహదారిపై సోమవారం సాయంత్రం ఈ దారుణ సంఘటన జరిగింది.
పిల్లలిద్దరూ ఇరుగుపొరుగు ఇళ్లలో ఉండే స్నేహితులే. ఆడుకునేందుకు వెళదామంటూ సోమవారం సాయంత్రం నీరజ్ కుమార్‌ను పదో తరగతి విద్యార్థి తీసుకెళ్లాడు. అనంతరం గొంతు కోశాడు. సంఘటన స్థలానికి చేరుకున్న స్థానికులు నీరజ్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. హత్యకు పాల్పడిన బాలుడు పోలీసుల విచారణలో చాలా ఆశ్చర్యకరమైన విషయం చెప్పాడు. తనకు చదువు ఇష్టం లేకపోయినా తల్లిదండ్రులు బలవంతంగా పాఠశాలకు పంపుతున్నారని తెలిపాడు. హత్య చేస్తే జైలులో ఉండవచ్చని, చదువుకోవాల్సిన అవసరం లేదని తెలియడంతోనే.. నీరజ్ ప్రాణాలు తీసినట్లు వెల్లడించాడు. కేసు నమోదుచేసిన పోలీసులు.. బాలుడిని జువెనైల్ హోమ్‌కు పంపనున్నట్లు తెలిపారు.