దేశ రాజధాని దిల్లీలో ఓ యువతిని గ్యాంగ్ రేప్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉద్యోగం ఇస్తానని ఓ వ్యక్తి.. అతడితో పాటు మరో ఇద్దరు యువతిపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ దారుణాన్ని వీడియో తీసి బాధితురాలిని బెదిరించారు. అత్యాచారం విషయం పోలీసులకు చెబితే వీడియోను ఆన్లైన్లో అప్లోడ్ చేస్తామని బ్లాక్ మెయిల్ చేశారు.
పోలీసులు తెలిపిన వివారల ప్రకారం.. దిల్లీకి చెందిన ఓ యువతి(19)కి.. 2020లో సోషల్ మీడియా ద్వారా అనుభవ్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. ఉద్యోగం ఇప్పిస్తానని యువతికి అతడు ఆశచూపించాడు. ఇటీవల నగరంలోని మాలవీయ నగర్ మెట్రోస్టేషన్ వద్దకు రమ్మని చెప్పాడు. నిందితుడిని నమ్మిన సదరు యువతి.. అతడు చెప్పిన ప్లేస్కు వెళ్లింది. అయితే, అక్కడ అనుభవ్.. తన ఇద్దరు స్నేహితులతో కారులో ఎదురుచూశాడు. యువతిని కారు ఎక్కించుకుని కొంతదూరం తీసుకెళ్లాడు. బేగంపుర్ ప్రాంతం వద్దకు రాగానే కారు ఆపి.. నిందితులు యువతిని రేప్ చేశారు. అఘాయిత్యం చేసేటప్పుడు వీడియో కూడా తీశారు. 'పోలీసులకు చెబితే.. ఈ వీడియో సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తాం' అని యువతిని బెదిరించారు. ఈ మేరకు సదరు యువతి బుధవారం మాలవీయ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు ఆధారంగా ఐపీసీ సెక్షన్లు, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు దిల్లీ సౌత్ డీసీపీ చందన్ చౌదరీ తెలిపారు.
రేప్ చేసిన సోదరుడి ఫ్రెండ్..
ఉత్తర్ప్రదేశ్లో దారుణం జరిగింది. ఓ మహిళపై ఆమె సోదరుడి స్నేహితుడు అత్యాచారం చేశాడు. ఆ సమయంలో ఫొటోలు, వీడియోలు తీసుకున్నాడు. జరిగిన విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. అనంతరం ఆమె ప్రైవేటు వీడియోను వాట్సాప్లో సర్క్యూలేట్ చేశాడు. బాలియా జిల్లాలో ఏప్రిల్ 6న జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు.. నిందితుడిని అరెస్టు చేశారు.
వృద్ధురాలిని చంపేసిన పనిమనిషి..
దిల్లీలో ఓ వృద్ధురాలిని పనిమనిషి మరో వ్యక్తి సహాయంతో హతమార్చింది. అనంతరం డబ్బు, నగలతో ఉడాయించింది. ఈ ఘటన బిందాపుర్లోని ఓం విహార్ ప్రాంతంలో బుధవారం జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉష(66) అనే వృద్ధురాలు ఓం విహార్ ప్రాంతంలో నివాసముంటోంది. ఆమెకు శరీరం సహకరించకపోవడం వల్ల పనిమనిషిని ఏర్పాటు చేసుకుంది. వృద్ధురాలి అసహాయతను ఆసరాగా తీసుకున్న పనిమనిషి.. డబ్బు, నగలు కాజేయాలని పథకం పన్నింది. వృద్ధురాలు ఒంటరిగా ఉన్న సమయంలో ఓ వ్యక్తితో కలసి ఆమెను హతమార్చింది. అనంతరం డబ్బు, నగలతో పారిపోయింది. బుధవారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో పోలీసులకు ఈ సమాచారం అందింది. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను ఆ రోజు రాత్రి గోరఖ్పుర్ రైల్వే స్టేషన్ వద్ద అదుపులోకి తీసుకున్నారు.