Gangajal Dos and Don'ts in House: హిందువులు గంగా నదిని దేవతా స్వరూపంగా భావిస్తారు. అందుకే.. అత్యంత పవిత్రంగా పరిగణిస్తారు. ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా గంగాజలం ఉపయోగిస్తారు. మత విశ్వాసాల ప్రకారం.. గంగ మోక్షాన్ని ఇస్తుంది. ప్రతిరోజూ ఎంతో మంది గంగా నదిలో స్నానం చేస్తారు. గంగా నదిలో మునిగితే.. వారి పాపాలన్నిటినీ దూరం చేస్తుందని విశ్వాసం. ఈ యుగంలో కూడా గంగా దేవి పట్ల ప్రజలకు ఎనలేని భక్తిభావం ఉంది.
గంగా పుష్కరాలకు వెళ్లినప్పుడు చాలా మంది ప్రజలు.. ఖచ్చితంగా గంగాజలాన్ని తీసుకొచ్చి తమ ఇళ్లలో ఉంచుకుంటారు. ఎందుకంటే గంగాజలాన్ని ఇంట్లో ఉంచుకోవడం శుభప్రదంగా భావిస్తారు. గంగాజలాన్ని ఇంట్లో ఉంచితే.. జీవితంలో అభివృద్ధి ఉంటుందని నమ్ముతారు. అయితే.. ఈ నీరు ఇంట్లో ఉన్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే నష్టపోతారని పండితులు చెబుతున్నారు. మరి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
గంగాజలాన్ని వీటిలో ఉంచకూడదు..:సాధారణంగా.. ప్రజల ఇళ్లలో గంగాజలాన్ని ప్లాస్టిక్ సీసాలు లేదా డబ్బాలు, మొదలైనవాటిలో ఉంచటం తరచుగా కనిపిస్తుంది. అయితే.. గంగాజలాన్ని పొరపాటున కూడా ఈ విధంగా ఉంచకూడదు. ఎందుకంటే ప్లాస్టిక్‌ను స్వచ్ఛమైనదిగా ఎవరూ పరిగణించరు. గంగాజలాన్ని ఎల్లప్పుడూ పవిత్రమైన పాత్రలో ఉంచాలి. వీలైనంతవరకు గంగాజలాన్ని ఉంచడానికి రాగి, ఇత్తడి, మట్టి లేదా వెండి పాత్రలో ఉంచడమే ఉత్తమం. వీలుకాకపోతే గాజు సీసాలో కూడా గంగాజలం నిల్వచేసుకోవచ్చు.
పొరపాటున కూడా ఈ పని చేయకండి..:మీ ఇంట్లో గంగాజలం ఉంచినట్లయితే ప్రతి సందర్భంలోనూ స్వచ్ఛత, పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. గంగాజలం ఉంచిన ప్రదేశంలో పొరపాటున కూడా నీచు వస్తువులు, మత్తు పదార్థాలు ఉంచకూడదు. వంట గదికి దూరంగా గంగాజలాన్ని ఉంచాలి. ఒకవేళ మీరు ఈ నియమాన్ని పాటించనట్లైతే.. సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుందని, గ్రహ దోషం కూడా ఉంటుందని చెబుతున్నారు.