తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'శత్రువులను ఫుట్​బాల్​లా ఆడుకుంటా'.. పార్టీ గుర్తు, మేనిఫెస్టో ప్రకటించిన గాలి జనార్ధన్​ రెడ్డి - Kalyana Rajya Pragati Paksha party football symbol

గాలి జనార్ధన్​ రెడ్డి.. తాను పెట్టిన కొత్త పార్టీ సింబల్​ను ప్రకటించారు. పుట్​బాల్​ను తన పార్టీగా గుర్తుగా ఎంచుకున్నారు. 12 మందితో తొలి అభ్యర్థుల జాబితా, మేనిఫెస్టోను ప్రకటించారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు సొంత పార్టీతో పాటు శత్రువులు ఫుట్‌బాల్‌ ఆడుకున్నారన్న జనార్దన్‌రెడ్డి.. ఇప్పుడు తాను ఆడుకుంటానని తెలిపారు.

gali janardhan reddy party symbol
గాలి జనార్ధన్ రెడ్డి పార్టీ గుర్తు

By

Published : Mar 27, 2023, 8:29 PM IST

గనుల వ్యాపారి, కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్‌రెడ్డి ఫుట్‌బాల్‌ను తన పార్టీ గుర్తుగా ప్రకటించారు. రానున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు 12 మంది అభ్యర్థులను ప్రకటించారు. పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను సైతం విడుదల చేశారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు సొంత పార్టీతో పాటు శత్రువులు తనను ఫుట్‌బాల్‌ ఆడుకున్నారన్న జనార్దన్‌రెడ్డి.. ఇప్పుడు తాను కూడా ఆడుకుంటానని తెలిపారు. 3 నెలల క్రితం కల్యాణ రాజ్య ప్రగతి పక్ష పేరిట రాజకీయ పార్టీ ప్రకటించిన గాలి జనార్దన్‌రెడ్డి.. సోమవారం పార్టీ గుర్తును ప్రకటించారు.

పార్టీ మేనిఫెస్టో ప్రకటిస్తూ.. ఐదు ఎకరాల కన్నా తక్కువ ఉన్న రైతులకు పెట్టుబడి సాయాన్ని అందిస్తామన్నారు. సంవత్సరానికి రూ. 15,000 ఇస్తామని వెల్లడించారు. వార్షిక ఆదాయం ఐదు లక్షల కన్నా తక్కువ ఉన్న వారికి ఆరోగ్య శ్రీ కింద ఉచిత వైద్యం అందిస్తామని గాలి జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు. మహిళలు, నిరుద్యోగులకు నెలకు రూ. 2,500 ఇస్తామని వెల్లడించారు. ఇళ్లు లేని కుటుంబాలకు మహిళల పేరుతో రెండు పడక గదుల ఇళ్లు నిర్మించి ఇస్తామని తెలిపారు. మరిన్ని పథకాలను సైతం అమలు చేస్తామని వెల్లడించారు.

గంగావతి నుంచి తాను పోటీ చేస్తానని చెప్పిన జనార్దన్‌రెడ్డి.. బళ్లారి నుంచి తన భార్య అరుణ లక్ష్మీ పోటీలో ఉంటారని వెల్లడించారు. మరో పది మందికి సైతం టికెట్లను కేటాయించారు. కల్యాణ రాజ్య ప్రగతి పక్ష పార్టీ కర్ణాటకలోని తెలుగు మాట్లాడే ప్రాంతాల్లో ఎక్కువగా దృష్టి సారించనున్నట్లు సమాచారం. దాదాపు 15 జిల్లాల్లో తమ పార్టీ సంస్థాగత పనులు కొనసాగుతున్నాయన్న గాలి జనార్థన్​ రెడ్డి.. అభివృద్ధి లేని గ్రామీణ ప్రాంతాల్లో నిత్యం పర్యటిస్తున్నట్లు తెలిపారు. అక్కడి ప్రజలు తనపై, పార్టీపై అభిమానం చూపుతున్నారన్నారని వెల్లడించారు.

బళ్లారికి గాలి జనార్ధన్​ రెడ్డి వెళ్లొద్దని గతంలో కోర్టు ఆదేశాలు జారీచేసింది. దీంతో అక్కడి నుంచి తన భార్యను పోటీ చేయిస్తున్నారు జనార్ధన్​ రెడ్డి. మైనింగ్ కుంభకోణం కేసులో జనార్ధన్​ రెడ్డిని సీబీఐ అరెస్టు చేసినప్పటి నుంచి ఆయన రాజకీయాలను దూరంగా ఉంటున్నారు.

రాజకీయ పార్టీని స్థాపించే సమయంలో భాజపాతో తన బంధంపై గాలి జనార్దన్​ రెడ్డి స్పష్టతనిచ్చారు. తాను భాజపాలో సభ్యుడ్ని కాదని తెలిపారు. భాజపాతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. కల్యాణ రాజ్య ప్రగతి పార్టీ పేరుతో, తన ఆలోచనలకు తగినట్లుగా కొత్త పార్టీ ప్రారంభిస్తున్నానని.. ఆ సమయంలో జనార్ధన్ రెడ్డి తెలిపారు. ప్రతి పల్లెకు, గడప గడపకూ వెళ్తానని.. కర్ణాటకను సంక్షేమ రాజ్యంగా మారుస్తానని హామి ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details