తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Gaganyan TV-D1 Launch Successful: గగన్‌యాన్‌ ప్రాజెక్టులో తొలి అడుగు.. టీవీ-డీ1 పరీక్ష విజయవంతం - AP Latest News

Gaganyan TV-D1 Launch Successful: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గగన్‌యాన్‌ ప్రాజెక్టులో తొలి అడుగు పడింది. ఇస్రో తొలి పరీక్ష ‘టెస్ట్‌ వెహికిల్‌ అబార్ట్‌ మిషన్‌ టీవీ డీ1 (TV D1) ప్రయోగం విజయవంతమైంది. అంతరిక్షానికి వ్యోమగాములను పంపి.. తిరిగి సురక్షితంగా భూమిపైకి తెచ్చే క్రూ మాడ్యూల్‌ను వాహకనౌక ద్వారా ప్రయోగించి విజయవంతంగా పరీక్షించింది.

gaganyan
gaganyan

By ETV Bharat Telugu Team

Published : Oct 21, 2023, 4:03 PM IST

Gaganyan TV-D1 Launch Successful: గగన్‌యాన్‌ ప్రాజెక్టులో తొలి అడుగు.. టీవీ-డీ1 పరీక్ష విజయవంతం

Gaganyan TV-D1 Launch Successful:రోదసిలోకి సొంతంగా వ్యోమగాములను పంపేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న గగన్‌యాన్‌ సాకారం దిశగా తొలి అడుగు పడింది. గగన్‌యాన్‌ ప్రాజెక్టులో కీలకమైన టెస్ట్‌ వెహికిల్‌ అబార్ట్‌ మిషన్‌ టీవీ డీ1(TV D1) వాహక నౌక పరీక్షను ఇస్రో విజయవంతంగా పరీక్షించింది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటనుంచి ఉదయం 10 గంటలకు సింగిల్‌ స్టేజ్‌ లిక్విడ్‌ రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లింది. ఆ తర్వాత రాకెట్‌ నుంచి విడిపోయిన క్రూ మాడ్యూల్‌ సురక్షితంగా పారాచూట్ల సాయంతో సముద్ర ఉపరితలంపై దిగింది. వాతావరణం అనుకూలంగా లేకపోవడం వల్ల రెండుసార్లు వాయిదా పడిన ప్రయోగం చివరికి ఫలవంతమైంది. ఈ ప్రయోగం విజయవంతం కావడంపై సంతోషం వ్యక్తం చేసిన ఇస్రో ఛైర్మన్‌ సోమనాథ్‌.. ఇక భవిష్యత్తు ప్రయోగాలపై దృష్టి సారిస్తామని వెల్లడించారు.

Aditya L1 Launch : నింగిలోకి 'ఆదిత్య ఎల్​ 1'.. ప్రయోగం సక్సెస్.. వీడియో చూశారా?

ఇస్రో(ISRO)ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గగన్‌యాన్‌ ప్రాజెక్టులో (Gaganyan project) తొలి అడుగు పెడింది. ఈ రోజు ఉదయం పది గంటలకు శ్రీహరికోటలోని షార్‌ నుంచి నింగిలోకి దూసుకెళ్లిన సింగిల్‌ స్టేజ్‌ లిక్విడ్‌ రాకెట్‌ క్రూ మాడ్యూల్‌ పారాచూట్‌ల సాయంతో సురక్షితంగా సముద్రంలో ల్యాండ్‌ అయ్యింది. టీవీ డీ1 పరీక్ష ద్వారా వ్యోమగాముల భద్రతకు సంబంధించిన వ్యవస్థ సమర్థతను ఇస్రో నిరంతరం విశ్లేషించనుంది. రాకెట్‌ నింగిలోకి బయల్దేరాక ఇస్రో శాస్త్రవేత్తలు అబార్ట్‌ సంకేతం పంపారు. దీంతో రాకెట్ పైభాగంలో క్రూ ఎస్కేప్‌ వ్యవస్థకు సంబంధించిన ఘన ఇంధన మోటార్లు ప్రజ్వరిల్లాయి. దాదాపు 12 కిలోమీటర్ల ఎత్తులో.. క్రూ ఎస్కేప్‌ వ్యవస్థను రాకెట్‌ నుంచి వేరు చేశాయి. 17 కిలోమీటర్ల ఎత్తులో క్రూ ఎస్కేప్‌ మాడ్యూల్‌, క్రూ మాడ్యూల్‌ పరస్పరం విడిపోయాయి. ఆ తర్వాత డ్రోగ్‌ పారాచూట్లు విచ్చుకున్నాయి. సెకనుకు 8.5 మీటర్ల వేగంతో క్రూ మాడ్యూల్‌ సురక్షితంగా బంగాళాఖాతంలోదిగింది.

గగన్‌యాన్‌లో వ్యోమగాముల భద్రతకు సంబంధించి కీలకమైన ఈ సన్నాహాక ప్రయోగం విజయవంతం కావడంపై ఇస్రో ఛైర్మన్‌ ఎస్‌. సోమనాథ్‌ హర్షం వ్యక్తం చేశారు. టీవీ డీ1 ప్రయోగం విజయవంతమైందని ప్రకటిస్తున్నందకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రయోగం ఉద్దేశం గగన్‌యాన్‌లో వ్యోమగాములు తప్పించుకునే వ్యవస్థను పరీక్షించడం. క్రూ ఎస్కేప్‌ మాడ్యూల్‌, క్రూ మాడ్యూల్‌ వాహక నౌక నుంచి విజయవంతంగా విడిపోయాయి. దానికి సమాంతరంగా క్రూ మాడ్యూల్‌ను సురక్షితంగా కిందకి దించేలా పారాచూట్లు విచ్చుకున్నాయి. తర్వాత నిర్దేశించిన వేగంతో క్రూ మాడ్యూల్‌ బంగాళాఖాతంలో దిగింది. ఈ అంత సమాచారం మేం సేకరించాం. ఇప్పటివరకూ అందిన సమాచారం ప్రకారం అంతా అనుకున్న ప్రకారమే పక్కాగా జరిగింది.

Aditya L1 Launch : నింగిలోకి దూసుకెళ్లిన 'ఆదిత్య ఎల్​1'.. సూర్యుడిని నిమిషానికోసారి క్లిక్‌!

గగన్‌యాన్‌ ప్రాజెక్ట్‌ తొలి పరీక్ష టెస్ట్‌ వెహికిల్‌ అబార్ట్‌ మిషన్‌ టీవీ డీ1 ప్రయోగాన్ని ఇస్రో ఉదయం 8 గంటలకే చేపట్టాల్సి ఉన్నా వాతావరణం అనుకూలించక వాయిదా పడింది. అనంతరం ఉదయం 8 గంటల 45 నిమిషాలకు ప్రయోగాన్ని వాయిదా వేశారు. కానీ చివరి నిమిషంలో సాంకేతిక లోపం తలెత్తడంతో ప్రయోగాన్ని నిలిపివేశారు. అనంతరం ఆ లోపాన్ని వేగంగా గుర్తించి సరిచేశారు. ఈ క్రమంలోనే ఉదయం 10 గంటలకు రెండోసారి ప్రయోగాన్ని చేపట్టగా అది విజయవంతమైంది. వ్యోమనౌక తీసుకెళ్లిన క్రూ ఎస్కేప్‌ సిస్టమ్‌ బరువు 12.5 టన్నులు కాగా.. క్రూ మాడ్యూల్‌ బరువు 4.5 టన్నులు.

వ్యోమగాములను 400 కిలోమీటర్ల ఎత్తులోని దిగువ భూ కక్ష్యలోకి పంపించి 3 రోజుల పాటు అక్కడే ఉంచి తిరిగి సురక్షితంగా భూమికి తీసుకురావాలన్నది గగన్‌యాన్‌ ప్రాజెక్టు లక్ష్యం. 2025లో ఈ యాత్ర జరిగే అవకాశం ఉందని ఇస్రో ఛైర్మన్‌ సోమనాథ్‌ తెలిపారు. ఆ దిశగా కొన్ని కీలక పరిజ్ఞానాలపై కొన్నేళ్లుగా ఇస్రో కసరత్తు చేస్తోంది. ఇప్పుడు వాటిని గగనతలంలో పరీక్షిస్తోంది. మొదటగా టీవీ-డీ1 పరీక్షను నిర్వహించింది. ఇందులో క్రూ ఎస్కేప్‌ సిస్టమ్‌ సమర్థత, క్రూ మాడ్యూల్‌ పనితీరు, వ్యోమనౌకను క్షేమంగా కిందకి తెచ్చే డిసలరేషన్‌ వ్యవస్థ పటిష్ఠతను పరిశీలించనుంది. సాగర జలాల్లో పడిన క్రూ మాడ్యూల్‌ను సేకరించి విశ్లేషిస్తోంది.

Aditya L1 Mission : 'అంతరిక్ష రంగంలో భారత్‌ పాత్ర పెరుగుతోంది'.. 'ఆదిత్య' విజయం కోసం హోమాలు, పూజలు

మానవసహిత వ్యోమనౌకతో నింగిలోకి బయలుదేరిన వెంటనే రాకెట్‌లో ఏదైనా లోపం ఉత్పన్నమైనప్పుడు వ్యోమగాముల ప్రాణాలు ప్రమాదంలో పడిపోతాయి. అలాంటి పరిస్థితుల్లో.. వారు కూర్చొనే క్రూ మాడ్యూల్‌ను రాకెట్‌ నుంచి వేరు చేసి, సురక్షితంగా కిందకి తీసుకురావాలి. దీన్ని క్రూ ఎస్కేప్‌ సిస్టమ్‌ సీఈఎస్​(CES) అంటారు. ఇది ఒకరకంగా అత్యవసర ద్వారం లాంటింది. క్రూ ఎస్కేప్‌ వ్యవస్థ చాలా చురుగ్గా, మెరుపు వేగంతో పనిచేయాలని ఈ దిశగా క్రూ ఎస్కేప్‌ వ్యవస్థ కోసం క్విక్‌ రియాక్టింగ్‌ సాలిడ్‌ మోటార్లను అభివృద్ధి చేశామని ఇస్రో తెలిపింది. ఇస్రో విజయవంతంగా పూర్తి చేసిన ప్రయోగంలో వాహకనౌక గమనం.. మానవ సహిత గగన్‌యాన్‌ యాత్రను పోలి ఉంటుంది. అది సెకనుకు 400 మీటర్ల వేగంతో దూసుకెళ్లింది. ఈ సారి దాదాపుగా పూర్తిస్థాయిలో సిద్ధమైన వ్యోమనౌకను పరీక్షించిన ఇస్రో దాని ఫలితాల ఆధారంగా ఇస్రో తదుపరి పరీక్షలకు సిద్ధమవుతోంది.

ABOUT THE AUTHOR

...view details