Telangana Folk Singer Gaddar Life Story :నడుముకు తెల్లటిపంచె, ఒంటిపై నల్లటి గొంగడి, చేతికి కడియాలు, కాళ్లకు గజ్జెలు, తలకు ఎర్రటి వస్త్రంతో గద్దర్ ఎక్కడికి వెళ్లినా ప్రత్యేకంగా కనిపించేవారు. తర్వాత వస్త్రధారణ మార్చినా తనదైన శైలిని మాత్రం కొనసాగించారు. ఒగ్గుకథ, బుర్రకథ, ఎల్లమ్మ కథలను ప్రజలకు చెప్పే కళాకారుడిగా సాంస్కృతిక చైతన్యాన్ని ప్రారంభించినగద్దర్... క్రమంగా ప్రజలు ఇతివృత్తంగా ఉండే సమస్యలు, వివక్షపై కలం ఝళిపించారు. కుటుంబ నియంత్రణ, కుల వివక్ష, అస్పృశ్యత, దోపిడీ, ప్రపంచీకరణ ప్రభావం, వెనుకబాటు తనం, పల్లెల అమాయకత్వంపై అనేక రూపాల్లో దాదాపు 600పైగా పాటలు పాడారు.
Poet Gaddar Passed Away :విద్యార్థి దశ నుంచే గద్దర్... ప్రజాజీవితంలో సాగారు. శ్రీకాకుళం రైతాంగ ఉద్యమం, విప్లవకారులైన వెంపటాపు సత్యం తదితరుల ప్రభావం గద్దర్‌పై బలంగా ఉంది. 1969 తెలంగాణ ఉద్యమంలో విద్యార్థిగా పాల్గొని జైలుకు వెళ్లారు. 1970వ దశకంలో విప్లవ రాజకీయాలవైపు ఆకర్షితులయ్యారు. తెలుగు సమాజంలో జరిగిన అన్ని ప్రత్యామ్నాయ ఉద్యమాల్లోనూ ఆయన భాగస్వాములయ్యారు. ఎమర్జెన్సీ సమయంలో నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో అజ్ఞాతంలో గడిపారు. ఎమర్జెన్సీలో 1985 వరకు సాంస్కృతిక ఉద్యమం నడిపించి, 1990 దాకా అండర్‌గ్రౌండ్ ఉద్యమంలో పోరు సాగించారు. 1990 ఫిబ్రవరి 19న ఆరేళ్ల అజ్ఞాత జీవితాన్ని వీడి జనజీవన స్రవంతిలోకి వచ్చారు.
Leaders Condolence on Gaddar Death : 'గద్దర్ అకాల మరణం తెలంగాణ సమాజానికి తీరని లోటు'
Gaddar Role in Telangana Movement : 1997 ఏప్రిల్ 6న ఆయనపై తూటాల వర్షం కురిసింది. తీవ్రంగా గాయపడినా కోలుకున్నారు. 2004లో ప్రభుత్వానికి, మావోయిస్టులకు మధ్య జరిగిన శాంతి చర్చల్లోనూ పాల్గొన్నారు. 2010 అక్టోబరు 9న దాదాపు 107 ప్రజా సంఘాలతో కలిసి తెలంగాణ ప్రజా ఫ్రంట్‌ను స్థాపించి... రెండేళ్లు అధ్యక్షుడిగా కొనసాగారు. తొలి, మలిదశ తెలంగాణ ఉద్యమాల్లో ప్రత్యేకంగా నిలిచారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఆయన రాసిన పాటలు ఉద్యమానికి కొత్త రూపుని ఇచ్చి ముందుకు తీసుకెళ్లాయి. తుది శ్వాస విడిచే వరకు జనం కోసమే గద్దర్ పాట, ఆట కొనసాగింది.