రోజంతా దొంగలు, నేరగాళ్లతో ఉంటూ.. ఆయన విధులు నిర్వర్తిస్తారు. ఇంటికి రాగానే.. తన పిల్లలతో సమయం గడపాల్సి ఉంటుంది. ఇంత బిజీ షెడ్యూల్ మధ్యలోనూ తనలోని కళను మాత్రం వదులుకోలేదాయన. పనికిరాని చెక్కముక్కలు, రాళ్లు.. ఇంకా మరే వస్తువైనా సరే... ఆయన చేతిలో పడిందంటే అద్భుతమైన రూపంలోకి మారాల్సిందే. ఆయనే బంగాల్లోని రాయ్గంజ్కు చెందిన కానిస్టేబుల్ విప్లవ్ కుమార్ దాస్.
ఇస్లామ్పుర్కు చెందిన విప్లవ్ కుమార్.. ఉద్యోగరీత్యా రాయ్గంజ్లో నివసిస్తుంటారు. ఆయన భార్య ఉపాధ్యాయురాలు. విప్లవ్కు చిన్నప్పటి నుంచి బొమ్మలు గీయడమంటే ఆసక్తి. కానీ, తన ఆర్థిక పరిస్థితి కారణంగా ఆ ఇష్టాన్ని మధ్యలోనే వదిలేయాల్సి వచ్చింది. అయినప్పటికీ.. తనలో ఉన్న కళాకారుడు మాత్రం ఊరికే ఉండిపోలేదు. చిత్రాలు వేయలేకపోయినా.. పనికిరాని వస్తువులతో కళాఖండాలను తీర్చిదిద్దుతున్నారు విప్లవ్. రాళ్లు, చెక్కలతో మొహెంజొదారో కాలానికి చెందిన ఓ నృత్యకారిణిని సృష్టించారు. గోడ గడియారాన్ని జింక ముఖాకృతిలోకి మార్చారు.