Bokaro Mine: ఝార్ఖండ్ బొకారోలోని బొగ్గు గనిలో చిక్కుకున్న నలుగురు కార్మికులు నాలుగు రోజుల తర్వాత సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. ఎన్డీఆర్ఎఫ్, పోలీసులు వారికి సాయం చేయలేకపోయినా 96 గంటల పాటు తవ్వుకుంటూ గని నుంచి బయటకు వచ్చారు. దీంతో వారి కుటుంబ సభ్యులు ఆనందంలో మునిగిపోయారు.
బొకారో గనిలోని పర్వత్పుర్ బ్లాక్లో పనిచేసే నలుగురు కార్మికులు శ్రవణ్ రజ్వార్, లక్ష్మణ్ రజ్వార్, అనాడి సింగ్, భరత్ సింగ్ నవంబర్ 26న గనిలో ప్రమాదం జరిగినప్పుడు తప్పిపోయారు. శిథిలాల కింద చిక్కుకున్న మరికొంతమంది కార్మికులను స్థానికులు కాపాడారు. పోలీసులు నవంబర్ 27న ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా ఆ మరునాడు రంగంలోకి దిగారు. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసిన ఈ నలుగురిని బయటకు తీసుకురాలేకపోయారు.
అయితే వీరు మాత్రం జీవితంపై ఆశలు వదులుకోలేదు. తవ వద్ద ఉన్న పార, గునపాలతో తవ్వడం ప్రారంభించారు. అలా 96 గంటల పాటు నిర్విరామంగా తవ్వి గని నుంచి ప్రాణాలతో బయటపడ్డారు. తమ నలుగురి వద్ద టార్చి లైట్లు ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకునేందుకు ఒక టార్చిని ఉపయోగిస్తున్నప్పుడు మిగతా వాటిని వాడలేదని కార్మికులు చెప్పారు. నాలుగు రోజుల పాటు కేవలం నీళ్లు తాగినట్లు వెల్లడించారు. గని నుంచి బయటపడ్డ వీరికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించేందుకు వైద్య సిబ్బంది వెళ్లారు. కానీ ఆస్పత్రికి వెళ్లేందుకు వారు నిరాకరించారు.