తెలంగాణ

telangana

ETV Bharat / bharat

జస్టిస్‌ జీటీ నానావతి కన్నుమూత - సిక్కులపై దాడులు జస్టిస్‌ జీటీ నానావతి

గోధ్రా అల్లర్లు, 1984 సిక్కు వ్యతిరేక హింస కేసులను విచారించిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జీటీ నానావతి(86) మరణించారు. ఆయన శనివారం గుండెపోటుతో చనిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

justice
నానావతి

By

Published : Dec 19, 2021, 6:46 AM IST

సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ గిరీశ్‌ ఠాకోర్‌లాల్‌ నానావతి (86) కన్నుమూశారు. దేశంలో సంచలనం రేపిన 1984 నాటి సిక్కు వ్యతిరేక దాడులు, 2002 నాటి గోధ్రా దాడుల కేసులు ఈయనే విచారించారు. స్వరాష్ట్రం గుజరాత్‌లో శనివారం మధ్యాహ్నం గుండెపోటుతో మృతిచెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. 1935లో బ్రిటిష్‌ ఇండియాలో పుట్టిన నానావతి బాంబే హైకోర్టు న్యాయవాదిగా 1958లో నమోదు చేయించుకున్నారు. 1979లో గుజరాత్‌ హైకోర్టు జడ్జిగా నియమితులై, 1993లో ఒడిశా హైకోర్టుకు బదిలీ అయ్యారు. ఆ మరుసటి ఏడాది అక్కడే ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. తర్వాత కర్ణాటక హైకోర్టుకు బదిలీ అయ్యారు. 1995లో సుప్రీంకోర్టు జడ్జిగా నియమితులై, 2000 సంవత్సరంలో పదవీ విరమణ పొందారు.

2002 నాటి గోధ్రా దాడులపై ఏర్పాటుచేసిన కమిషన్‌ తుది నివేదికను జస్టిస్‌ అక్షయ్‌ మెహతాతో కలిసి 2014లో అప్పటి గుజరాత్‌ ముఖ్యమంత్రి ఆనందీ బెన్‌ పటేల్‌కు జస్టిస్‌ నానావతి అందజేశారు. ఈ దాడుల సందర్భంగా చోటుచేసుకున్న హింసలో దాదాపు వెయ్యిమంది మరణించారు. ఇందులో మైనారిటీ వర్గాలకు చెందినవారే ఎక్కువగా ఉన్నారు. గోధ్రా రైల్వేస్టేషనుకు సమీపంలో సబర్మతి ఎక్స్‌ప్రెస్‌కు చెందిన రెండు రైలు పెట్టెలను ఆందోళనకారులు తగులబెట్టారు. 59 మంది కర సేవకులు నాటి దుర్ఘటనలో మృతిచెందారు. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్‌ రాష్ట్ర సీఎంగా ఉన్నపుడు ఈ దాడులపై విచారణకు 2002లో కమిషన్‌ను ఏర్పాటు చేశారు. మోదీ నేతృత్వంలోని నాటి గుజరాత్‌ ప్రభుత్వానికి ఈ కమిషన్‌ క్లీన్‌చిట్‌ ఇచ్చింది.

1984లో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హత్య తర్వాత సిక్కులపై దాడులు జరిగాయి. ఈ దాడులపై విచారణకు 2000 సంవత్సరంలో భాజపా ఆధ్వర్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్‌ కూడా జస్టిస్‌ నానావతి ఆధ్వర్యంలోనే విచారణ సాగించింది. 2005లో ఈ కమిషన్‌ తన నివేదికను సమర్పించింది. అప్పటి కేంద్ర మంత్రి, కాంగ్రెస్‌ నేత జగదీశ్‌ టైట్లర్‌కు వ్యతిరేకంగా విశ్వసనీయ ఆధారాలు ఉన్నాయని పేర్కొంది. మరికొందరు కాంగ్రెస్‌ నేతలు కూడా ఈ దాడులను ప్రోత్సహించారని వెల్లడించింది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details