Food Served In Toilet : ఉత్తరప్రదేశ్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి క్రీడా టోర్నమెంట్‌లో దారుణం జరిగింది. బాలికలకు అధికారులు టాయిలెట్లలో భోజనాలు ఏర్పాట్లు చేశారు. సహరన్‌పుర్ జిల్లాలో ఈనెల 16న అండర్-17 బాలికల కబడ్డీ టోర్నమెంట్ జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 200 మంది క్రీడాకారిణులు ఈ టోర్నీలో పాల్గొన్నారు. అయితే ఈ పోటీల సమయంలో తమకు స్టేడియం టాయిలెట్‌లో భోజనాలు ఏర్పాటు చేసినట్లు కొందరు జూనియర్ ఆటగాళ్లు ఆరోపించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు కూడా బయటికొచ్చాయి. టాయిలెట్ గదిలో వంటపాత్రలు ఉండగా అందులో నుంచి అమ్మాయిలు వడ్డించుకున్నట్లు వీడియోలో ఉంది. ఒక చోట అయితే పూరీలను నేలపై ఓ పేపర్‌లో వేసి పెట్టారు.
స్థలం లేనందునే ఇలా చేశామని అధికారులు వివరణ ఇవ్వడం మరిన్ని విమర్శలకు దారితీసింది. భోజనాలను టాయిలెట్‌లో ఏర్పాటు చేయలేదని.. తప్పనిసరి పరిస్థితుల్లో వంటపాత్రలను బట్టలు మార్చుకునే గదిలో పెట్టాల్సి వచ్చిందని సహరన్‌పుర్ జిల్లా క్రీడాధికారి అనిమేశ్ సక్సేనా చెప్పారు. ప్రస్తుతం స్టేడియం నిర్మాణదశలో ఉందని వర్షం కారణంగా వంటపాత్రలు పెట్టేందుకు స్థలం లేకపోవడం వల్ల స్విమ్మింగ్ పూల్ పక్కనే ఉన్న దుస్తులు మార్చుకునే గదిలో పెట్టామని సక్సేనా చెప్పారు. ఈ ఘటనపై చర్యలు చేపట్టిన ఉన్నతాధికారులు.. సహరన్‌పుర్ జిల్లా క్రీడా అధికారిని సస్పెండ్ చేశారు. అనంతరం ఈ వ్యవహారంపై దర్యాప్తునకు ఆదేశించారు.