Five Skeletons Found in Ruined House :కర్ణాటక చిత్రదుర్గలో ఓ ఇంటి నుంచి 5 అస్తిపంజరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అవన్నీ ఇంటి యజమాని అయిన ప్రభుత్వ విశ్రాంత ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ జగన్నాథ్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులవేనని భావిస్తున్నారు. ఫోరెన్సిక్ పరీక్షలు చేయించి, ఈ మరణాలకు కారణం ఏంటో తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
2019 నుంచి కనిపించని జగన్నాథ్ కుటుంబం!
అస్తిపంజరాలు ఉన్న భవనం చిత్రదుర్గ జిల్లా జైలు రోడ్డులో ఉంది. ఆ ఇంటి యజమాని జగన్నాథ్ రెడ్డి(85). ఆయన తుమకూరు పీడబ్ల్యూడీ విభాగంలో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా పని చేసి పదవీ విరమణ పొందారు. జగన్నాథ్ రెడ్డితోపాటు ఆయన భార్య ప్రేమ(80), కుమార్తె త్రివేణి(62), కుమారులు కృష్ణ(60), నరేంద్ర(57) అదే ఇంట్లో ఉండేవారు. తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడే వీరంతా ఇతరులకు చాలా దూరంగా ఉండేవారని పోలీసుల విచారణలో తేలింది. 2019 జూన్-జులై తర్వాత వారు అసలు ఎవరికీ కనిపించలేదని తెలిసింది.
జగన్నాథ్ రెడ్డి ఇంట్లో అస్తిపంజరాలు ఉన్నాయని గురువారం స్థానిక మీడియా ప్రతినిధుల ద్వారా పోలీసులకు సమాచారం అందింది. వెంటనే చిత్రదుర్గ పోలీసులు రంగంలోకి దిగారు. ఇంటి లోపలకు వెళ్లిన వారికి దిగ్భ్రాంతికర దృశ్యాలు కనిపించాయి. ఒక గదిలో మంచాలపై రెండు అస్తిపంజరాలు, నేలపై మరో రెండు అస్తిపంజరాలు ఉన్నాయి. అవన్నీ నిద్రపోతున్న భంగిమలో కనిపించాయి. మరో గదిలో ఐదో అస్తిపంజరం ఉంది. ఆ ఇంట్లోకి కొందరు అనేక సార్లు చొరబడి, చోరీలకు పాల్పడి ఉంటారని అక్కడి పరిస్థితిని చూసిన పోలీసులు అనుమానిస్తున్నారు.